దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సూపర్-12 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఈ టోర్నీలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందగా, దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు టేబుల్ టాపర్‌గా నిలవనుంది. 


అయితే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిస్తే మాత్రం పాకిస్తాన్ దాదాపు ఇంటిదారి పట్టినట్లే. కాబట్టి గ్రూప్‌లోని అన్ని జట్లకు ఇది కీలకమైన మ్యాచ్ కానుంది. సెమీస్ జట్లను నిర్ణయించే మ్యాచ్‌గా ఇది జరగనుంది. ఈరోజు పెర్త్‌లో వర్షం పడే అవకాశం లేకపోవడం కలిసొచ్చే అంశం.


భారత జట్టులో కేఎల్ రాహుల్ ఫాం కంగారు పెడుతోంది. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో అర్థ సెంచరీతో రోహిత్ శర్మ కూడా టచ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ముగ్గురూ భీకరమైన ఫాంలో ఉన్నారు. అన్నీ కలిసొచ్చి స్థాయికి తగ్గట్లు ఆడితే ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం కష్టం కాదు.


భారత తుదిజట్టు
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్


దక్షిణాఫ్రికా తుదిజట్టు
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), టెంబా బవుగా (కెప్టెన్), రిలీ రోసో, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోర్జే