సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. డీన్ ఎల్గర్ అద్భుత పోరాటంతో ప్రొటీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన డీన్ ఎల్గర్ భారీ శతకం సాధించి అజేయంగా నిలిచాడు. దీంతో రెండో రోజూ ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. సఫారీ జట్టు ఇప్పటికే 11 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతుకుముందు ఓవర్‌నైట్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 208 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. మరో 37 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రాహుల్ అద్భుత శతకం చేసి భారత్ కు గౌరవమైన స్కోర్ అందించాడు. టెయిలెండర్లతో కలిసి రాహుల్ ఒక్కో పరుగూ జోడిస్తూ.. టీమిండియాకు మంచి స్కోరు అందించాడు. 164 పరుగుల దగ్గర 7వ వికెట్ కోల్పోయిన తర్వాత బుమ్రా, సిరాజ్ లతో కలిసి రాహుల్ స్కోరును 245 పరుగుల వరకూ తీసుకెళ్ళాడు. కోహ్లి 38, శ్రేయస్ అయ్యర్ 31, శార్దూల్ ఠాకూర్ 24 పరుగులు చేశారు.
సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన రాహుల్..
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ చేశాడు. ఈ దెబ్బకి బుధవారం సెంచూరియన్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన రెండో భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. రెండో రోజు ఉదయం 70 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన రాహుల్.. 137 బంతుల్లో 101 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. తన 8వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేఎల్ 66వ ఓవర్‌లో గెరాల్డ్ కుట్జీపై మిడ్-వికెట్ వైపు సిక్సర్ కొట్టాడు. రాహుల్ కేవలం 80 బంతుల్లో సిక్సర్ కొట్టి యాభైని పూర్తి చేశాడు. తొలి రోజు 70 పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్.. రెండో రోజు 101 పరుగులు పూర్తి చేసిన చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 245 పరుగుల వద్ద ఆగిపోయింది. సెంచూరియన్‌లో రాహుల్‌కి ఇది వరుసగా రెండో సెంచరీ. భారత్ గత చివరి సిరీస్‌లో మూడంకెల మార్కును చేరుకున్నాడు. దీంతో ఒకే వేదికలో అధిక సెంచరీలు చేసిన మొదటి విదేశీ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆదిలోనే షాక్ తగిలింది. 5 పరుగులు చేసిన మార్‌క్రమ్‌ను సిరాజ్ అవుట్ చేసి ప్రొటీస్‌ను దెబ్బతీశాడు. దీంతో 11 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జోర్జీ... డీన్ ఎల్గర్ ప్రొటీస్ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 90కిపైగా పరుగులు జోడించారు. 28 పరుగులు చేసిన జోర్జీని బుమ్రా అవుట్ చేశాడు. అనంతరం కాసేపటికే పీటర్సన్‌ను కూడా బుమ్రా అవుట్ చేశాడు. దీంతో 113 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. కానీ బెండిగామ్‌తో జతకలిసిన డీన్ ఎల్గర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.
బెండిగామ్- డీన్ ఎల్గర్ వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 56 పరుగులు చేసిన బెండిగామ్‌ను సిరాజ్ అవుట్ చేయడంతో 244 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.... పటిష్టస్థితిలో కనిపించింది. కానీ తర్వాత అయిదు పరుగులకే బుమ్రా మరో వికెట్ తీసి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా డీన్ ఎల్గర్ మాత్రం సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. 23 ఫోర్లతో 140 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో రెండో రోజూ ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. సఫారీ జట్టు ఇప్పటికే 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజూ భారత బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లను ఎంత త్వరగా అవుట్ చేస్తారన్న దానిపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.