దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 45.5 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీమిండియా ఏడు వికెట్లతో మ్యాచ్‌లో విజయం సాధించింది.  శ్రేయస్ అయ్యర్ (113 నాటౌట్: 111 బంతుల్లో, 15 ఫోర్లు) అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు. దీంతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో వన్డే మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.


శ్రేయస్ అయ్యర్ శతకం
278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కోరిన ఆరంభం లభించలేదు. స్కోరు బోర్డు మీద 48 పరుగులు చేరేసరికి ఓపెనర్లు శిఖర్ ధావన్ (13: 20 బంతుల్లో, ఒక ఫోర్), శుభ్‌మన్ గిల్ (28: 26 బంతుల్లో, ఐదు ఫోర్లు) అవుటయ్యారు. అయితే ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (93: 84 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు. మొదట మెల్లగా ఆడినప్పటికీ క్రీజులో సమయం గడిపేకొద్దీ ఆటలో వేగం పెంచారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు ఏకంగా 161 పరుగులు జోడించడం విశేషం.


అయితే సెంచరీ ముంగిట భారీ షాట్‌కు ప్రయత్నించి ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. అనంతరం సంజు శామ్సన్‌తో (30 నాటౌట్: 36 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కలిసి శ్రేయస్ అయ్యర్ మ్యాచ్‌ను ముగించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ, వేన్ పార్నెల్, ఫార్ట్యూన్ తలో వికెట్ తీసుకున్నారు.


సాహసం చేసిన సౌతాఫ్రికా
అంతకు ముందు టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా సాహసం చేసింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో ఫామ్‌లోకి వచ్చిన క్వింటన్ డికాక్‌ (5) జట్టు స్కోరు 7 వద్దే పెవిలియన్‌ చేరాడు. మహ్మద్‌ సిరాజ్‌ ఆఫ్‌ సైడ్‌ వేసిన బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. కష్టంగా ఉన్న పిచ్‌పై జానెమన్‌ మలన్‌ (25; 31 బంతుల్లో 4x4)తో కలిసి రెజా హెండ్రిక్స్‌ మంచి ఇన్నింగ్స్‌ నిర్మించాడు. తక్కువ బౌన్స్‌తో బంతులు ఇబ్బంది పెడుతున్నా ఓపికగా నిలిచి రెండో వికెట్‌కు 33 రన్స్‌ భాగస్వామ్యం అందించాడు. కీలక సమయంలో మలన్‌ను అరంగేట్రం ఆటగాడు షాబాజ్‌ అహ్మద్‌ ఎల్బీ చేశాడు. అప్పటికి సౌతాఫ్రికా స్కోరు 40.


ఈ సిచ్యువేషన్‌లో అయిడెన్‌ మార్క్రమ్‌ సింగిల్స్‌ తీస్తూ హెండ్రిక్స్‌కు అండగా నిలిచాడు. ఫామ్‌ లేకపోవడంతో ఆచితూచి ఆడాడు. క్రీజులో నిలదొక్కుకున్నాక బౌండరీలు బాదాడు. హెండ్రిక్స్ 58, మార్క్రమ్‌ 64 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు అందుకొని 129 బంతుల్లో 129 భాగస్వామ్యం అందించారు. అజేయంగా మారిన ఈజోడీని హెండ్రిక్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా సిరాజ్‌ విడదీశాడు. 31.2వ బంతికి అతడిచ్చిన క్యాచ్‌ను షాబాజ్‌ అహ్మద్‌ అందుకున్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ మరోసారి నిలవడంతో టీమ్‌ఇండియా వికెట్‌ తీసేందుకు 215 వరకు ఆగాల్సి వచ్చింది. ఇదే స్కోరు వద్ద క్లాసెన్‌, మార్‌క్రమ్‌ ఔటయ్యారు. ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్ తనదైన రీతిలో సింగిల్స్‌, బౌండరీలు బాదడంతో దక్షిణాఫ్రికా 278-8తో నిలిచింది.