IND vs SA 2nd ODI: రాంచీలో దక్షిణాఫ్రికా రాణించింది! టీమ్‌ఇండియా ముందు మెరుగైన టార్గెట్టే ఉంచింది! బ్యాటింగ్‌ చేసేందుకు కష్టమైన పిచ్‌పై భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 278 సాధించింది. రెజా హెండ్రిక్స్‌ (74; 76 బంతుల్లో 9x4, 1x6), అయిడెన్‌ మార్‌క్రమ్‌ (79; 89 బంతుల్లో 7x4, 1x6) తిరుగులేని హాఫ్‌ సెంచరీలు చేశారు. మిడిలార్డర్లో హెన్రిచ్‌ క్లాసెన్‌ (30; 26 బంతుల్లో 2x4, 2x6), డేవిడ్‌ మిల్లర్‌ (35*; 34 బంతుల్లో 4x4, 0x6) మరోసారి అదరగొట్టారు. టీమ్‌ఇండియాలో సిరాజ్‌ 3 వికెట్లు పడగొట్టాడు.




రెజా, మార్క్రమ్ దూకుడు


టాస్‌ గెలిచినప్పటికీ సఫారీలు తొలుత బ్యాటింగే ఎంచుకున్నారు. తొలి వన్డేలో ఫామ్‌లోకి వచ్చిన క్వింటన్ డికాక్‌ (5) జట్టు స్కోరు 7 వద్దే పెవిలియన్‌ చేరాడు. మహ్మద్‌ సిరాజ్‌ ఆఫ్‌ సైడ్‌ వేసిన బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. కష్టంగా ఉన్న పిచ్‌పై జానెమన్‌ మలన్‌ (25; 31 బంతుల్లో 4x4)తో కలిసి రెజా హెండ్రిక్స్‌ మంచి ఇన్నింగ్స్‌ నిర్మించాడు. తక్కువ బౌన్స్‌తో బంతులు ఇబ్బంది పెడుతున్నా ఓపికగా నిలిచి రెండో వికెట్‌కు 33 రన్స్‌ భాగస్వామ్యం అందించాడు. కీలక సమయంలో మలన్‌ను అరంగేట్రం ఆటగాడు షాబాజ్‌ అహ్మద్‌ ఎల్బీ చేశాడు. అప్పటికి సౌథాఫ్రికా స్కోరు 40.




మళ్లీ క్లాసెన్, మిల్లర్ అండ


ఈ సిచ్యువేషన్‌లో అయిడెన్‌ మార్క్రమ్‌ సింగిల్స్‌ తీస్తూ హెండ్రిక్స్‌కు అండగా నిలిచాడు. ఫామ్‌ లేకపోవడంతో ఆచితూచి ఆడాడు. క్రీజులో నిలదొక్కుకున్నాక బౌండరీలు బాదాడు. హెండ్రిక్స్ 58, మార్క్రమ్‌ 64 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు అందుకొని 129 బంతుల్లో 129 భాగస్వామ్యం అందించారు. అజేయంగా మారిన ఈజోడీని హెండ్రిక్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా సిరాజ్‌ విడదీశాడు. 31.2వ బంతికి అతడిచ్చిన క్యాచ్‌ను షాబాజ్‌ అహ్మద్‌ అందుకున్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ మరోసారి నిలవడంతో టీమ్‌ఇండియా వికెట్‌ తీసేందుకు 215 వరకు ఆగాల్సి వచ్చింది. ఇదే స్కోరు వద్ద క్లాసెన్‌, మార్‌క్రమ్‌ ఔటయ్యారు. ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్ తనదైన రీతిలో సింగిల్స్‌, బౌండరీలు బాదడంతో దక్షిణాఫ్రికా 278-8తో నిలిచింది.