India vs South Africa 2nd ODI: భారత్, దక్షిణాఫ్రికా రెండో వన్డే టాస్ వేశారు. టాస్ గెలిచిన సఫారీ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తెంబా బవుమా బదులు కేశవ్ మహారాజ్ టాస్‌కు వచ్చాడు. అనారోగ్యంతో బవుమా, తబ్రైజ్ శంషీ ఆడటం లేదని వెల్లడించాడు. రెజా హెండ్రిక్స్, ఫార్టూయిన్‌ను తీసుకున్నామని ప్రకటించాడు.
టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకుందామని అనుకున్నామని శిఖర్ ధావన్ చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ వచ్చే అవకాశం ఉందన్నాడు. దానిని అనుకూలంగా తీసుకోవచ్చని పేర్కొన్నాడు. జట్టులో రెండు మార్పులు చేశామన్నాడు. రుతురాజ్, రవి బిష్ణోయ్ ఆడటం లేదన్నాడు. వాషింగ్టన్ సుందర్ పునరాగమనం చేస్తున్నాడని వివరించాడు. షాబాజ్ అహ్మద్ అరంగేట్రం చేస్తున్నాడని వెల్లడించాడు.
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, అవేశ్ ఖాన్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, జానెమన్ మలన్, రెజా హెండ్రిక్స్, అయిడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పర్నెల్, కేశవ్ మహరాజ్, ఫార్టూయిన్, కాగిసో రబాడా, ఆన్రిచ్ నోకియా
ఇషాన్‌పై అందరి చూపు
ఏకనా వేదికగా సాగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియాను ఎంత మెచ్చుకున్నా తక్కువే! కఠినమైన ప్రత్యర్థి బౌలింగ్‌ను కాచుకొని దాదాపుగా గెలిచినంత పనిచేసింది. ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగినా సఫారీలను వణికించింది. అయితే టాప్ ఆర్డర్ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెప్టెన్సీ చేపట్టినా వన్డే ప్రపంచకప్‌లో శిఖర్ ధావన్‌కు చోటు దొరకుతుందో లేదో తెలియని పరిస్థితి! అందుకే ఆడిన ప్రతి మ్యాచులో రాణించాల్సిన అవసరం అతడిపై ఉంది. రుతురాజ్, శుభ్‌మన్ గిల్ మెరుగ్గా ఆడాలి. సొంత గడ్డ కావడంతో ఇషాన్ కిషన్ నుంచి ఫ్యాన్స్ మెరుపుల్ని ఆశిస్తారు. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ ఆటతీరు అద్భుతం. దీపక్ చాహర్ లేకపోవడంతో ఆవేశ్ ఖాన్, సిరాజ్, శార్దూల్ పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు. రవి బిష్ణోయ్ ప్లేస్‌లో షాబాజ్ అహ్మద్ అరంగేట్రం చేయొచ్చు. వాషింగ్టన్ సుందర్‌కు ఇప్పుడే అవకాశం దొరక్కపోవచ్చు.
మిల్లర్ పై ఆశలు
తొలి మ్యాచ్ విజయంతో దక్షిణాఫ్రికా వన్డే ప్రపంచకప్ లీగ్ పాయింట్లను 59కి పెంచుకుంది. అయినప్పటికీ 11వ స్థానంలోనే ఉంది. మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించాలంటే మిగతా రెండు మ్యాచుల్లో తప్పక గెలవాలి. అయిడెన్ మార్‌క్రమ్ సగటు చెత్తగా ఉంది. గాయంతో డ్వేన్ ప్రిటోరియస్ దూరమయ్యాడు. మార్కో జన్‌సెన్, అండిలె ఫెలుక్‌వాయో టీ20 ప్రపంచకప్ చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. తబ్రైజ్ శంషీ బౌలింగ్‌ను టార్గెట్ చేయడంతో మరోసారి కేశవ్ మహారాజ్‌పైనే ఆధారపడనుంది. పేస్ పరంగా ఇబ్బందుల్లేవ్. రబాడా, జన్‌సెన్, ఫెలుక్‌వాయో బాగానే బౌలింగ్ చేస్తున్నారు. ఓపెనింగ్‌లో డికాక్, మిడిలార్డర్లో డేవిడ్ మిల్లర్ కీలకం. మిల్లర్ మ్యాచ్ ఆడతాడో లేడో తెలియదు. కెప్టెన్ తెంబా బవుమా ఫామ్ లేమి వేధిస్తోంది.
ఇద్దరికీ అనుకూలం
రాంఛీలో వర్షం పడే అవకాశాలు 20 శాతం ఉన్నాయి! అంటే 50 ఓవర్ల మ్యాచుకు ఢోకా లేదు! పిచ్ అటు బౌలింగ్, బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 280+గా ఉంది. పేసర్లు, స్పిన్నర్లు పోటాపోటీగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. పిచ్ ఇద్దరికీ సహకారం అందిస్తుంది.