దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తక్కువ పరుగులకే పరిమితమైంది. సఫారీ జట్టు బౌలర్లు సమర్థంగా రాణించడంతో భారత జట్టు 46.2 ఓవర్లకు 211 పరుగులు చేసి టీమిండియా ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్, కెప్టెన్ రాహుల్ రాణించడంతో టీమిండియా పర్వాలేదనిపించే స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా...భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అలా ఇన్నింగ్స్ ఆరంభించిందో లేదో టీమిండియాకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఫోర్ కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. రెండు బంతుల్లో నాలుగు పరుగులు చేసిన రుతురాజ్‌ను... బర్గర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో నాలుగు పరుగులకే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో అర్ధ శతకంతో సత్తా చాటిన సాయి సుదర్శన్ మరోసారి మెరిశాడు. తిలక్ వర్మ... కెప్టెన్ రాహుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న సాయి సుదర్శన్... ఆ తర్వాత సాధికార బ్యాటింగ్ చేశాడు.
ఈ క్రమంలో తిలక్ వర్మ మరోసారి తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. 30 బంతుల్లో 10 పరుగులు చేసిన తిలక్‌ను బర్గర్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత రాహుల్-సాయి సుదర్శన్ టీమిండియా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ పూర్తి ఆత్మ విశ్వాసంతో కనిపించాడు. ఈ క్రమంలో 65 బంతుల్లో అర్ధ శతకాన్ని అందుకున్నాడు . ఆ తర్వాత కాసేపటికే సాయి సుదర్శన్ అవుటయ్యాడు. 83 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో 62 పరుగులు చేసిన సాయి సుదర్శన్‌ను.... విలియమ్స్ అవుట్ చేశాడు. సాయి సుదర్శన్ అవుటయ్యాక... కెప్టెన్ కె.ఎల్, రాహుల్ రాణించాడు. 64 బంతుల్లో 7 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. రాహుల్ అవుటయ్యాక టీమిండియా వికెట్ల పతనం వేగంగా సాగింది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండడంతో దక్షిణాఫ్రికా బౌలర్లు సమర్థంగా రాణించారు. సంజు శాంసన్ 23 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. సంజు శాంసన్‌ను హెండ్రిక్స్ బౌల్డ్ చేశాడు. 136 పరుగుల వద్ద భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత వన్డేలోకి అరంగేట్రం చేసిన రింకూసింగ్ బరిలోకి దిగాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రింకూసింగ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సుతో 17 పరుగులు చేసి అవుటయ్యాడు. ఉన్నంత వరకు ధాటిగానే ఆడిన రింకూసింగ్‌ను... మహారాజ్ అవుట్ చేశాడు. దీంతో 169 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఏడు పరుగులు చేసి అక్షర్ పటేల్... ఒక పరుగు చేసి కుల్‌దీప్ యాదవ్ అవుటవ్వడంతో టీమిండియా 172 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి 200 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ అర్ష్‌దీప్ సింగ్ పర్వాలేదనిపించాడు. గత మ్యాచ్‌లో బాల్‌తో రాణించిన అర్ష్‌దీప్ 17 బంతుల్లో ఒక ఫోరు, ఒక సిక్సుతో జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. కానీ 18 పరుగులు చేసిన అర్ష్‌దీప్‌ను హెండ్రిక్స్ అవుట్ చేయడంతో టీమిండియా 204 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఆవేశ్ ఖాన్‌రనౌట్ కావడంతో 46.2 ఓవర్లకు 211 పరుగులు చేసి టీమిండియా ఆలౌట్ అయింది.
గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన భారత బౌలర్లు మరోసారి చెలరేగితే ప్రొటీస్‌ను కట్టడి చేయడం పెద్ద విషయమేమీ కాదు. గత మ్యాచ్‌లో చెలరేగిన అర్ష్‌దీప్ సింగ్... ఆవేశ్‌ఖాన్ మరోసారి రాణిస్తే 212 పరుగుల లక్ష్యాన్ని భారత్ కాపాడుకోవచ్చు..