Sameer Rizvi IPL Player: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ సమీర్‌ రిజ్వీపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ కాసుల వర్షం కురిపించింది. రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన రిజ్వీని రూ.8.4 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ దక్కించుకుంది. సమీర్‌ కోసం గుజరాత్‌, చెన్నై పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. కానీ చివరకు సమీర్‌ను భారీ ధరకు చెన్నై సూపర్‌ కింగ్స్ దక్కించుకుంది. 


ఐపీఎల్ వేలం అనగానే అందరికి గుర్తొచ్చేది.. విదేశీ క్రికెటర్లు. అంతర్జాతీయ అనుభవం, అత్యుత్తమ గణాంకాలు ఉన్న వారి కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈసారి వేలంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వీ సత్తా చాటాడు. ఉత్తర్ ప్రదేశ్, మీరట్ కు చెందిన 20 ఏళ్ల సమీర్‌ రిజ్వీ.. రైట్ ఆర్మ్ బ్యాట్స్‌మెన్‌తో పాటు మంచి ఆఫ్ స్పిన్నర్. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించగల సమర్ధుడు. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడగల సత్తా ఉన్నవాడని తెలుస్తోంది. సమీర్‌ రిజ్వీ మంచి ఆల్ రౌండర్ కాబట్టే చెన్నై సూపర్‌ కింగ్స్‌ భారీ ధరకు అతన్ని కొనుగోలు చేసింది.


ఇటీవల జరిగిన యూపీ టీ20 లీగ్ లో కాన్పూర్ సూపర్‌స్టార్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రిజ్వీ టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 104 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అండర్ 23 స్టేట్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో ఉత్తరప్రదేశ్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన రిజ్వీ.. యూపీ జట్టును విజేతగా నిలిపాడు. అరుణ్ జైట్లీ వేదికగా ఉత్తరాఖండ్‌ తో జరిగిన ఫైనల్లో రిజ్వీ 50 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు కీలక పాత్ర పోషించాడు. 


మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ఉత్సాహంగా జరుగుతోంది. ఈ వేలంలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్14 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి ఐపీఎల్ వేలంలో భారీ ధర పలుకుతుందని అంచనా వేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ హిట్టర్ డారిల్ మిచెల్ కూడా ఒకడు. నిలకడగా ఆడుతూ మంచి స్కోర్లు నమోదు చేస్తుండే మిచెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే నేటి ఐపీఎల్ వేలంలో డారిల్ మిచెల్ కు భారీ ధర పలికింది. చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. ఎందుకంటే డారిల్ మిచెల్ కనీస ధర రూ.1 కోటి మాత్రమే అయితే పలు ఫ్రాంచైజీలు వేలం పాటను అమాంతం పెంచేశాయి. అయితే తొలి దశలో వ్యూహాత్మకంగా మౌనంగా ఉండిపోయిన చెన్నై రూ.11 కోట్ల పాట వద్ద ఎంటరైన చెన్నై రూ.14 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది.


ఇటీవల వరల్డ్ కప్ ద్వారా వెలుగులోకి వచ్చిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రను కూడా కోటి 80 లక్షలకు సొంతం చేసుకుంది. నిజానికి రచిన్ రవీంద్ర ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని అందరూ భావించారు. ఎందుకంటే భారత గడ్డపై జరిగిన ఐసీసీ మెగా ఈవెంట్ లో రచిన్ రవీంద్ర 3 సెంచరీలు బాది పరుగులు వెల్లువెత్తించాడు. ఈ న్యూజిలాండ్ యువకుడు ICC ప్రపంచ కప్ 2023లో తన ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నాడు. దాంతో, ఐపీఎల్ వేలంలో అతడి కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోరాడతాయని, తద్వారా కళ్లు చెదిరే ధర వస్తుందని అందరూ ఊహించారు. కానీ అవేవీ జరగలేదు. ఐపీఎల్ మినీ వేలంలో రచిన్ రవీంద్ర కనీస ధర రూ.50 లక్షలు కాగా... అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ఆసక్తి చూపించాయి. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బాగా చవకగా రూ.1.80 కోట్లకు కొనుగోలు చేసింది.