దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (76: 48 బంతుల్లో, 11 ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు అదిరిపోయే స్టార్ట్ లభించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ మొదటి వికెట్‌కు 6.2 ఓవర్లలోనే 57 పరుగులు జోడించారు. అనంతరం వేన్ పార్నెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రుతురాజ్ గైక్వాడ్ అవుట్ కావడంతో ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది.


మొదటి వికెట్ పడ్డాక వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. మొదట శ్రేయస్ అయ్యర్ వేగంగా ఆడినప్పుడు ఇషాన్ తనకు చక్కటి సహకారం అందించాడు. మెల్లగా ఇషాన్ కిషన్ కూడా ఇన్నింగ్స్‌లో వేగం పెంచాడు. కేశవ్ మహరాజ్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో మొదటి నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు బౌండరీలను ఇషాన్ కిషన్ సాధించాడు. అదే ఓవర్లో చివరి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి ఇషాన్ అవుటయ్యాడు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించారు.


ఆ తర్వాత కాసేపటికే శ్రేయస్ అయ్యర్ కూడా అవుటయ్యాడు. ఆఖర్లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కూడా చెలరేగి ఆడారు. చివరి ఐదు ఓవర్లలో టీమిండియా 61 పరుగులు సాధించింది. 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, ఆన్రిచ్ నోర్జే, వేన్ పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్ తలో వికెట్ తీసుకున్నారు.