ఐపీఎల్ తర్వాత టీమిండియా తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటానికి సిద్ధం అయింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. సీనియర్లకు విశ్రాంతినివ్వడం, కుర్రాళ్లను ఎంపిక చేయడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. కేఎల్‌ రాహుల్‌ గాయంతో దూరమవ్వడంతో రిషభ్ పంత్‌ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.


టీమిండియా తుదిజట్టు
ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్


దక్షిణాఫ్రికా తుదిజట్టు
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, తబ్రయిజ్ షంసి,కగిసో రబడ, ఆన్రిచ్ నోర్జే


ఈ మ్యాచులో భువీ x డికాక్‌, యూజీ x బవుమా, హర్షల్‌ x మిల్లర్‌ పోరు కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు!


డికాక్‌పై భువీ స్వింగ్‌ అస్త్రం
ఐపీఎల్‌ 2022లో క్వింటన్‌ డికాక్‌ ఫర్వాలేదనిపించాడు. 36.29 సగటు, 149.97 స్ట్రైక్‌రేట్‌తో 508 పరుగులు చేశాడు. పవర్‌ప్లేలో అతడు చెలరేగే అవకాశం ఉంది. అతడిని అడ్డుకొనేందుకు టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను ప్రయోగించనుంది. ఎందుకంటే అతడు పవర్‌ప్లేలో బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ డికాక్‌ను ఇబ్బంది పెడతాడు. బంతి బ్యాటు అంచుకు తగిలి ఔటయ్యే ప్రమాదం ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో డికాక్‌ను భువీ రెండుసార్లు ఔట్‌ చేయడం గమనార్హం.


బవుమాని చాహల్ తిప్పేస్తాడా
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల వీరుడు యుజ్వేంద్ర చాహల్‌. 27 వికెట్లు తీసి రాజస్థాన్‌ రన్నరప్‌గా నిలవడంలో కీలకంగా మారాడు. ఘనంగా పునరాగమనాన్ని చాటాడు. మ్యాచులో ఏ దశలో బంతి ఇచ్చినా పరుగులు నియంత్రించడం, వికెట్లు తీయడం యూజీ అలవాటు. సఫారీ సారథి తెంబా బవుమాకు టీమ్‌ఇండియా స్పిన్నర్లపై మంచి అనుభవమే ఉంది. అయితే అతడిని యూజీ అడ్డుకోగలడు. ఫ్లయిడెట్‌ డెలివరీలతో ఊరించి ఔట్‌ చేయగలడు.


మిల్లర్‌ను ఆపాలంటే అతనొక్కడే!
గుజరాత్‌ టైటాన్స్‌ ఈ సీజన్లో విజేతగా నిలిచిందంటే డేవిడ్‌ మిల్లర్‌కు కచ్చితంగా క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. హార్దిక్‌ పాండ్య, టాప్‌ ఆర్డర్‌ విఫలమైన ప్రతిసారీ అతడు క్రీజులో నిలిచాడు. మ్యాచ్‌ విన్నింగ్‌ నాక్స్‌ ఆడాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియాపై మిల్లర్‌ ఆధిపత్యం చెలాయించే ఛాన్స్‌ ఉంది. ఇక్కడి పిచ్‌లపై అతడికి అనుభవం ఉంది. స్పిన్నర్లనూ ఆడటం నేర్చుకున్నాడు. అందుకే అతడిని అడ్డుకొనేందుకు హర్షల్‌ పటేల్‌ సరైన బౌలర్‌గా కనిపిస్తున్నాడు. వేగంలో చకచకా మార్పులు చేస్తూ వైవిధ్యంతో అతడిని బోల్తా కొట్టించగలడు. స్లోవర్‌ బాల్స్‌, కట్టర్స్‌తో నిలువరించగలడు.