IND vs PAK,  T20 World Cup 2024 Highleats: క్షణక్షణానికి మారుతున్న ఆధిపత్యం... బంతిబంతికి పెరుగుతున్న ఉత్కంఠ... ఓసారి అభిమానుల కేరింతలు.. మరోసారి అభిమానుల్లో నిర్వేదం. భారత్‌- పాక్(IND vs PAK) మ్యాచ్‌ అంటే ఎలా సాగాలో అలా సాగిందీ మ్యాచ్‌. ఈ లో స్కోరింగ్‌ హై టెన్షన్‌ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను చిత్తు చేసి భారత్‌ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అసలు ఆశలే లేని స్థాయి నుంచి టీమిండియా(Team India) బౌలర్లు పుంజుకుని ... అద్భుత విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయ కేతనం ఎగరేసిందంటే దానికి ప్రధాన కారణం బౌలర్లు. ప్రధానంగా బుమ్రా (Bumrah)అద్భుత స్పెల్‌తో దాయాదికి చుక్కలు చూపించాడు. ఈ గెలుపుతో టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో రోహిత్‌ సేన వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.


అద్భుతమే

నసావు(Nassau County International Cricket Stadium)లో బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా అద్భుతమే చేసింది. ఓటమి ఖాయమని అంతా  అనుకున్న సమయంలో పాక్‌పై ఒత్తిడి పెంచుతూ టీమిండియా చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాక్‌.. భారత్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించింది. భారత బ్యాటర్లను కట్టడి చేసిన పాక్‌... కేవలం 119 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ 113 పరుగులకే పరిమితమైంది. బుమ్రా నేతృత్వంలోని భారత బౌలర్లు సమష్టిగా రాణించి చిరకాల ప్రత్యర్థిపై చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ప్రధానంగా బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో పాక్‌ చుక్కలు చూపించాడు. సిరాజ్‌ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు మిగిలిన బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు.






 

తడబడ్డ భారత బ్యాటర్లు 

రోహిత్‌ శర్మ(Rohit Sharma)తో కలిసి విరాట్‌ కోహ్లీ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. తొలి ఓవర్‌ ముగిసిన వెంటనే వర్షం పడడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. కాసపేటి తర్వాత వర్షం తెరపినివ్వడంతో మ్యాచ్‌ ఆరంభమైంది. ఎదుర్కొన్న తొలి బంతినే అద్భుత కవర్‌ డ్రైవ్‌తో ఫోర్‌ కొట్టిన విరాట్‌... నాలుగు పరుగులే చేసి ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. కాసేపటికే 13 పరుగులు చేసి రోహిత్‌ శర్మ పెవిలియన్‌ చేరాడు. కానీ రిషభ్‌పంత్‌.. అక్షర్‌ పటేల్‌ టీమిండియాకు పోరాడే స్కోరు అందించాడు. పంత్‌ 42 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్‌ 20 పరుగులు చేశాడు. అక్షర్‌ పటేల్‌ ఎప్పుడైతే బౌల్డ్‌ అయ్యాడో అప్పటి నుంచి టీమిండియా వికెట్ల పతనం ఆరంభమైంది. వచ్చిన బ్యాటర్‌ వచ్చినట్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సూర్యాకుమార్‌ యాదవ్‌ 7, రవీంద్ర జడేజా 0, శివమ్‌ దూబే 3, హార్దిక్‌ పాండ్యా 7, అర్ష్‌దీప్‌ సింగ్ 9, బుమ్రా 0 ఇలా వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు పెవిలియన్‌కు చేరారు. టీమిండియా బ్యాటర్లలో ఏడుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌లకే పరిమితమయ్యారు. పాక్‌ బౌలర్లలో నసీమ్‌ షా, హరీస్‌ రౌఫ్‌ 3 వికెట్లతో భారత పతనాన్ని శాసించగా... షహీన్‌ షా అఫ్రీదీ 1, మహ్మద్‌ అమీర్‌ ఒక వికెట్‌ తీశారు. 

 

పాక్‌ గెలిచేలా కనిపించినా

120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు శుభారంభం దక్కింది. బాబర్‌ ఆజమ్‌- మహ్మద్‌ రిజ్వాన్‌ తొలి వికెట్‌కు 26 పరుగులు జోడించారు. ఆ తర్వాత బాబర్‌ను అద్భుత బంతితో బుమ్రా అవుట్‌ చేశాడు. కానీ ఆ తర్వాత మహ్మద్‌ రిజ్వాన్‌..ఉస్మాన్‌ ఖాన్‌ నిలబడడంతో పాక్‌ 10 ఓవర్లకు 57 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. రన్‌రేట్‌ మరీ ఎక్కువగా లేకపోవడంతో పాక్‌ తేలిగ్గానే గెలిచేలా అనిపించింది.

మూడు వికెట్లకు 73 పరుగులు చేసి సునాయసంగా చేసేలా కనిపించిన పాక్‌ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. వరుసగా వికెట్లు తీస్తూ... పరుగులు ఇవ్వకుండా ఒత్తిడి తెస్తూ చుక్కలు చూపించారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రిజ్వాన్‌ మాత్రం పోరాడాడు. క్రీజులో పాతుకుపోయిన రిజ్వాన్‌ను బుమ్రా అద్భుత బంతితో బౌల్డ్ చేయడంతో పాక్‌ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. అప్పటినుంచి మరింత ఒత్తిడి పెంచిన రోహిత్‌ సేన.. చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా అర్ష్‌దీప్‌ కేవలం 11 పరుగులే ఇచ్చాడు. దీంతో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.