India vs Pakistan Match  Pakistan opt to bowl : ఈ టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లోనే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాక్‌(Pakistan)... బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలవగానే మరో ఆలోచన లేకుండా పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌... బౌలింగ్‌ ఎంచుకున్నాడు. మేఘావృతమైన వాతవరణంలో టాస్ గెలవడం పాక్‌కు లాభించే అవకాశం ఉంది. న్యూయార్క్‌లోని నసావు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలోని పిచ్‌ ఇప్పటికే బౌలర్లకు అనుకూలించిన వేళ  ఈ మ్యాచ్‌లోనూ బౌలర్లు సత్తా చాటే అవకాశం ఉంది.

కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలిచి సూపర్‌ ఎయిట్‌కు మరింత చేరువ కావాలని టీమిండియా చూస్తుండగా.... ఇప్పటికే అమెరికా(USA) చేతిలో ఓడిపోయిన పాక్‌ ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే సూపర్‌ ఎయిట్‌ ఆశలు మరింత సంక్లిష్టంగా మారుతాయి. అందుకే ఈ మ్యాచ్‌ పాక్‌కు చాలా కీలకమైనది. నసావు పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తున్న వేళ నలుగురు ఫాస్ట్‌ బౌలర్లతో పాక్‌ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా(India) ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకూ టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌-పాక్ మధ్య ఏడు మ్యాచులు జరగగా.. అందులో పాక్‌ ఆరు మ్యాచుల్లో గెలుపొందింది. పాక్‌ కేవలం ఒకే మ్యాచులో గెలిచింది. అది కూడా బాబర్‌ ఆజమ్‌ నేతృత్వంలో గత టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాక్‌ ఘన విజయం సాధించింది. 
 

మార్పులు లేకుండానే

కీలకమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటారని భావించినా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన జట్టుతోనే భారత్‌ బరిలోకి దిగుతోంది. ఈ పిచ్‌పై బంతి అనూహ్యంగా స్పిన్‌, పేస్‌ అవుతుండడంతో పేసర్లకు తోడుగా స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ మెగా టోర్నమెంట్‌లో రిషభ్‌ పంత్‌ను ఫస్ట్‌ డౌన్‌లోకి తీసుకొచ్చి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్న టీమిండియా... బ్యాటింగ్‌లో ఇంకేమైనా మార్పులు చేస్తుందేమో చూడాలి.

తొలి మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ విజయం సాధించగా... విరాట్‌ కోహ్లీ విఫలమయ్యాడు. మరి ఈ మ్యాచ్‌లో విరాట్‌ పంజా విసిరితే పాక్‌కు కష్టాలు తప్పవు. బుమ్రా, సిరాజ్‌లతో కూడిన పేస్‌ విభాగం జూలు విదిలించి బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై నిప్పులు చెరిగితే పాక్‌ బ్యాటర్లకు తిప్పలు తప్పవు. స్పిన్‌, పేస్‌లో బలంగా... బ్యాటింగ్‌లో విధ్వంసకరంగా  కనిపిస్తున్న భారత్‌కు.... దాయాది పాక్‌ ఏ మేరకు పోటీ ఇవ్వగలదో చూడాలి. పాక్‌పై మ్యాచ్‌ అంటే చేలరేగిపోయే కోహ్లీ... మరోసారి భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. కోహీ గత పది ఇన్నింగ్స్‌ల్లో పాక్‌పై 400కుపైగా పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లోనూ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి పాక్‌పై ఘన విజయాన్ని అందించాడు. పాక్‌తో జరిగిన గత అయిదు మ్యాచుల్లో కోహ్లీ నాలుగు అర్ధ శతకాలు సాధించి సత్తా చాటాడు. 

 

టీమిండియా ఫైనల్‌ 11: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, సిరాజ్‌, అర్ష్‌దీప్ సింగ్‌, అక్షర్‌ పటేల్‌

 

పాక్‌ ఫైనల్‌ 11: బాబర్‌ ఆజమ్‌, ఉస్మాన్‌ ఖాన్‌, ఫకార్‌ జమాన్‌, షాదాబ్ ఖాన్‌, ఇమాద్‌ వసీమ్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, షహీన్‌ షా అఫ్రీదీ, నసీమ్ షా, మహ్మద్‌ అమీర్‌, హరీస్‌ రౌఫ్‌.