IND vs PAK T20 World Cup 2024 Pakistan restrict India to 119 all out: భారత్‌-పాక్‌(IND vs PAK )మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పిచ్‌పై భయాందోళనలే నిజమయ్యాయి. నసావు క్రికెట్‌ స్టేడియం(Nassau County International Cricket Stadium)లోని పిచ్‌ బౌలర్లకు అనుకూలించిన వేళ పాక్‌  బౌలర్లు రాణించారు. నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన పాక్‌... భారత్‌ను 119పరుగులకే కట్టడి చేసింది. పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్‌ అవుతున్న వేళ పాక్ బౌలర్లు రాణించారు. బ్యాట్‌పైకి బంతి కూడా సరిగ్గా రాలేదు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 119 పరుగులకే కట్టడి పరిమితమైంది. మరి పిచ్‌ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలిస్తున్న వేళ భారత బౌలర్లు పాక్‌ను కట్టడి చేస్తారేమో చూడాలి.

 

నిలబడుతూ... తడబడుతూ

ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌(Babar Azam) మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్‌ శర్మ(Rohit Sharma)తో కలిసి విరాట్‌ కోహ్లీ(Kohli) భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. తొలి ఓవర్‌లోనే చూడముచ్చటైన సిక్స్‌ కొట్టిన రోహిత్ శర్మ పాక్‌ జట్టుకు హెచ్చరికలు పంపాడు. అయితే తొలి ఓవర్‌లో ఎనిమిది పరుగులు వచ్చిన తర్వాత వర్షం పడడంతో కాసేపు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. కాసపేటి తర్వాత వర్షం తెరపినివ్వడంతో మ్యాచ్‌ ఆరంభమైంది. ఎదుర్కొన్న తొలి బంతినే అద్భుత కవర్‌ డ్రైవ్‌తో ఫోర్‌ కొట్టిన విరాట్‌... ఆ తర్వాతి బంతికే పాయింట్‌లో క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. కేవలం నాలుగు పరుగులే చేసి అవుటై విరాట్‌ మరోసారి నిరాశ పరిచాడు.  ఆ తర్వాత కాసేపటికే రోహిత్‌ శర్మ కూడా అవుటయ్యాడు. 13 పరుగులు చేసి రోహిత్‌ శర్మ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. 

 

పంత్‌ పోరాటం

క్రీజులోకి వచ్చినప్పటి నుంచి తీవ్రంగా ఇబ్బందిపడ్డ రిషభ్‌పంత్‌(Rishab Panth).. టీమిండియాకు పోరాడే స్కోరు అందించాడు. తొలుత పంత్‌ బ్యాట్‌ ఎడ్జ్‌లు తీసుకుని బౌండరీలు వచ్చాయి. పంత్‌ 42 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్‌ 20 పరుగులు చేశాడు. అక్షర్‌ పటేల్‌ ఎప్పుడైతే బౌల్డ్‌ అయ్యాడో అప్పటి నుంచి టీమిండియా వికెట్ల పతనం ఆరంభమైంది. వచ్చిన బ్యాటర్‌ వచ్చినట్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సూర్యకుమార్‌ యాదవ్‌, పాండ్యా ఇలా వచ్చినవాళ్లు వచ్చినట్లు పెవిలియన్‌కు చేరారు. సూర్యాకుమార్‌ యాదవ్‌ 7, రవీంద్ర జడేజా 0, శివమ్‌ దూబే 3, హార్దిక్‌ పాండ్యా 7, అర్ష్‌దీప్‌ సింగ్ 9, బుమ్రా 0 ఇలా వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు పెవిలియన్‌కు చేరారు. టీమిండియా బ్యాటర్లలో ఏడుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌లకే పరిమితమయ్యారు. పాక్‌ బౌలర్లలో నసీమ్‌ షా, హరీస్‌ రౌఫ్‌ 3 వికెట్లతో భారత పతనాన్ని శాసించగా... షహీన్‌ షా అఫ్రీదీ 1, మహ్మద్‌ అమీర్‌ ఒక వికెట్‌ తీశారు. భారత వికెట్లన్నీ పేసర్లకే పడడం విశేషం. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న విచ్‌పై 120 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ కాపాడుకుంటుందేమో చూడాలి.