భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ ఆదివారం దుబాయ్‌లో జరగనుంది. గత ఆదివారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌పై ఐదు వికెట్లతో విజయం సాధించింది. అయితే పాకిస్తాన్... హాంగ్‌కాంగ్‌పై విజయం సాధించింది సూపర్-4కు అర్హత సాధించడంతో రెండు జట్లూ మళ్లీ తలపడనున్నాయి. అన్నీ సమీకరణాలు అనుకూలిస్తే వచ్చే ఆదివారం జరిగే ఫైనల్స్‌లో కూడా ఈ రెండు జట్లే తలపడే అవకాశం ఉంది.


క్రికెట్ అభిమానులు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌ను  టీవీలు, మొబైల్స్‌లో లైవ్ చూసేందుకు అవకాశాలు ఉన్నాయి. కీలకమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మ్యాచ్‌కు దూరం కావడం భారత్‌కు పెద్ద దెబ్బ. తన స్థానంలో అక్షర్ పటేల్ ఆడనున్నారు.


భారత్ వర్సెస్ పాకిస్తాన్ సూపర్-4 మ్యాచ్ ఏ సమయానికి ప్రారంభం అవుతుంది?
భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 4వ తేదీ) రాత్రి 7:30 గంటలకు దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ ప్రారంభం కావడానికి అరగంట ముందు అంటే రాత్రి 7 గంటలకు టాస్ పడనుంది.


ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌ను ఎక్కడ చూడవచ్చు?
ఇండియా vs పాకిస్తాన్ ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ హెచ్‌డీ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో కూడా ఈ మ్యాచ్‌లు లైవ్ స్ట్రీమ్ ద్వారా చూడవచ్చు.


టీమిండియా జట్టు పరంగా పటిష్టంగానే కనిపిస్తోంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగబోతున్నారు. ఈ జోడి మంచి భాగస్వామ్యం అందిస్తే బాగుంటుంది. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. సూపర్ ఫాంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ నుంచి టీమిండియా మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది. మిడిలార్డర్ లో పాండ్యా కూడా మంచి ఫాంలో ఉన్నాడు. సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ లేదా రిషబ్ పంత్‌ల్లో ఒకరికి జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. యుజ్వేంద్ర చాహల్‌, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. పేస్ విభాగాన్ని భువనేశ్వర్ నడిపించనున్నాడు. అతనితో పాటు అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్ ఉంటారు. మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం అనుకుంటే అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్‌ల్లో ఒకరి బదులు రవి బిష్ణోయ్, అశ్విన్ లలో ఒకరిని అవకాశం రానుంది.