లెజెండ్స్ క్రికెట్ లీగ్ నుంచి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తప్పుకున్నాడు. ఇండియన్ మహారాజాస్ తరఫున గంగూలీ ఆడాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ మాజీ కెప్టెన్ లీగ్ లో పాల్గొనడం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


ఈ మేరకు శనివారం గంగూలీ ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడారు. సమయం లేకపోవడం వలనే తాను తప్పుకుంటున్నట్లు స్పష్టంచేసారు. ఛారిటీ కోసం ఒక మ్యాచ్ మాత్రమే ఆడతానని చెప్పారు. 


సెప్టెంబర్ 16న వరల్డ్ ఎలెవన్ తో ఇండియన్ మహారాజాస్ ఈడెన్ గార్డెన్స్ లో తలపడాల్సి ఉంది. అయితే ఈ నిర్ణయంతో కోల్ కతా అభిమానులతో పాటు, భారత క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. పదేళ్ల తర్వాత తమ ప్రిన్స్  మైదానంలో దిగబోతున్నాడని వారు చాలా ఆనందపడుతున్నారు. ఒకానొక సమయంలో తాను ఈ లీగ్ లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నట్లు గంగూలీ చెప్పాడు. ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో సౌరవ్ తప్పుకోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


మాజీ క్రికెటర్లు కలిసి ఆడడాన్ని చూడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మిగిలిన లెజెండరీ ఆటగాళ్లు ఆడుతున్నప్పటికీ.. గంగూలీ లేకపోవడం లోటనే చెప్పాలి.  అతను లేకపోవటంతో లీగ్ పై ఆసక్తి కూడా తగ్గుతుందని విశ్లేషకులు అంటున్నారు. కాగా వరల్డ్ ఎలెవన్ కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహిస్తుండగా.. ఇండియన్ మహారాజాస్ టీం ను సచిన్ నడిపించనున్నాడు. 


2022 సెప్టెంబర్, 16 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా.. కోల్ కతా లోని ఈడెన్ గార్డ్సెన్స్ లో ఇండియా మహారాజాస్-వరల్డ్ జెయింట్స్ మధ్య ప్రత్యేక మ్యాచ్ తో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. 


మొత్తం ఆరు నగరాలు


సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు జరిగే  3 మ్యాచ్ లకు కోల్ కతా ఆతిథ్యమివ్వనుంది. దీంతోపాటు న్యూదిల్లీ, కటక్, లఖ్ నవూ, జోధ్ పూర్ లలో మ్యాచులు జరగనున్నాయి. జోధ్ పూర్, లఖ్ నవూ మినహా మిగిలిన వాటిల్లో మూడేసి గేములు నిర్వహించనున్నారు.


మ్యాచ్ ల వివరాలు


కోల్ కతా    సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు



లఖ్ నవూ  సెప్టెంబర్ 21 నుంచి 22 వరకు



న్యూదిల్లీ     సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు



కటక్           సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు



జోధ్ పూర్    అక్టోబర్ 1 నుంచి 3 వరకు


ప్లేఆఫ్స్       అక్టోబర్ 5 మరియు 7  (వేదిక ఖరారు చేయలేదు)



ఫైనల్          అక్టోబర్ 8 (వేదిక ఖరారు చేయలేదు)