మళ్లీ దాయాదుల పోరుకు సమయం వచ్చేసింది. ఆసియా కప్ లో రెండోసారి తలపడేందుకు చిరకాల ప్రత్యర్థులు సిద్ధమయ్యారు. ఈ ఆదివారం సూపర్- 4 లో భాగంగా జరిగే మ్యాచ్ లో భారత్- పాకిస్థాన్ ఢీకొనబోతున్నాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో హాంకాంగ్ ను చిత్తుగా ఓడించిన పాక్ సూపర్- 4లో అడుగుపెట్టింది. ఆడిన 2 లీగు మ్యాచుల్లోనూ నెగ్గిన టీమిండియా ఇప్పటికే సూపర్- 4కు చేరిన విషయం తెలిసిందే. 


క్రికెట్ ప్రేమికులను అలరించడానికి, భావోద్వేగాల స్థాయిని పెంచడానికి, ఉత్కంఠ రేపే క్షణాలను పంచడానికి భారత్- పాక్ ఆటగాళ్లు సన్నద్ధమయ్యారు. ఆసియా కప్ లో సూపర్ - 4కు అర్హత సాధించిన దాయాది జట్లు మరో సమరానికి సై అంటున్నాయి.  సెప్టెంబర్ 4న ఈ మ్యాచ్ జరగనుంది. 


భారత్ గెలిచినా.. అసంతృప్తే


లీగు మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయం సాధించింది. అయితే సంపూర్ణ ఆధిపత్యంతో ఆ గెలుపు అందలేదు. చివరి ఓవర్లో గెలిచిన ఆ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా తప్ప ఎవరూ స్థాయికి తగ్గట్టు బ్యాటింగ్ చేయలేదు. బౌలర్లు బాగానే ఆడినా.. బ్యాట్స్ మెన్ మాత్రం అనుకున్నంతగా రాణించలేదు. అయితే హాంకాంగ్ తో మ్యాచ్ లో రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ బ్యాట్లు ఝుళిపించారు. అయితే ఇక్కడ బౌలర్లు విఫలమయ్యారు. పసికూన హాంకాంగ్ 152 పరుగులు చేసిందంటే మన బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.


తడబాటు బ్యాటింగ్


ఆసియా కప్ లో భారత్ బ్యాటింగ్ విభాగం అనుకున్నంతగా రాణించట్లేదు. గాయం నుంచి కోలుకుని తిరిగివచ్చిన రాహుల్ ఇంకా ఫాంలోకి రాలేదు. పాక్ పై డకౌట్ అయిన అతను.. హాంకాంగ్ తో మ్యాచ్లో 36 పరుగులు చేయడానికి 39 బంతులు తీసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ తన స్టైల్ బ్యాటింగ్ తో ఆకట్టుకోవడంలేదు. పాక్ పై ఎక్కువ బంతులు ఆడకుండానే పెవిలియన్ చేరిన రోహిత్.. పసికూనతో మ్యాచ్ లో 21 పరుగులు చేసినప్పటికీ అది తన స్థాయికి తగిన ప్రదర్శన కాదు. ఇక కోహ్లీ రెండు మ్యాచుల్లోనూ రాణించినప్పటికీ.. మునుపటిలా ఆడట్లేదన్నది అంగీకరించవలసిన విషయం. ఇక సూర్యకుమార్, పాండ్య సూపర్ ఫాంలో ఉన్నారు. అయితే ఆల్ రౌండర్ జడేజా గాయంతో ఈ టోర్నీ మొత్తానికి దూరం కావడం భారత్ కు పెద్ద దెబ్బే. దినేశ్ కార్తీక్, పంత్ కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. వారు ఎలా ఆడతారో చూడాల్సి ఉంది. 


బౌలింగ్ లో ఆ ఒక్కడే


భారత బౌలింగ్ విషయానికొస్తే పేసర్లలో సీనియర్ భువనేశ్వర్ ఒక్కడే రాణిస్తున్నాడు. పరుగులు నియంత్రించడంతోపాటు వికెట్లు తీస్తున్నాడు. కొత్త కుర్రాళ్లు అర్హదీప్, అవేష్ ఖాన్ అంచనాలకు తగ్గట్లు బౌలింగ్ చేయడంలేదు. ముఖ్యంగా అవేష్ ఖాన్ ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. స్పిన్ విభాగంలో చహాల్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. వికెట్లు తీయట్లేదు. జడేజా స్థానంలో జట్టు యాజమాన్యం అక్షర్ పటేల్ ను ఎంపిక చేసింది. అతను స్పిన్ ఆల్ రౌండరే. 


భీకరంగా పాక్


మరోవైపు ప్రత్యర్థి పాకిస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ లలో భీకరంగా కనిపిస్తోంది. భారత్ తో మ్యాచ్ లో గెలుపు అంచుల వరకు వెళ్లిన దాయాది.. పసికూన హాంకాంగ్ ను చిత్తుచేసింది. బ్యాటింగ్ లో మెరుపులతో 193 పరుగులు చేసింది. బౌలింగ్ తో హాంకాంగ్ ను 38 పరుగులకే పడగొట్టి.. 155 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇది కచ్చితంగా వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేదే. బ్యాటింగ్ లో కెప్టెన్ బాబర్ విఫలమవుతున్నప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్ షాదాబ్ ఖాన్, ఖుష్ దిల్ షా వంటివారు రాణిస్తున్నారు. బౌలింగ్ లో మొదటి నుంచి పాక్ దుర్భేద్యమే. నసీం షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, దహానీ వంటి వారితో పటిష్ఠంగా ఉంది. 



వార్నింగ్ బెల్


హాంకాంగ్ పై 155 పరుగుల భారీ తేడాతో గెలిచిన పాక్ భారత్ కు వార్నింగ్ బెల్ పంపింది. తమను తక్కువ అంచనా వేయొద్దని గట్టిగా చెప్పినట్లయింది. 


మరి బ్యాటింగ్, బౌలింగ్ లో సమస్యలు ఎదుర్కొంటున్న టీమిండియా.. పటిష్టంగా కనిపిస్తున్న పాకిస్థాన్ ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఆందోళన చెందాల్సిన విషయమేమీ లేదు. ఎందుకంటే సూపర్- 4లో ఒక్కో జట్టు 3 మ్యాచులు ఆడుతుంది. కాబట్టి ఒకటి ఓడినా మిగిలిన మ్యాచుల్లో గెలిస్తే ఫైనల్ కు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ దాయాదుల సమరంలో టీమిండియానే గెలవాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటారు. చూద్దాం.. రేపటి మ్యాచ్ లో ఏం జరుగుతుందో.