ఆసియా కప్‌లో పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించింది. శుక్రవారం హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏకంగా 155 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం హాంగ్ కాంగ్ 10.4 ఓవర్లలో 38 పరుగులకే ఆలౌట్ అయింది. హాంగ్ కాంగ్‌ను కుప్పకూల్చడం ద్వారా టీమిండియాకు పాకిస్తాన్ సిగ్నల్ పంపించిందనే అనుకోవాలి. ఎందుకంటే ఆదివారం జరగనున్న సూపర్-4 మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మొదటి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (9: 8 బంతుల్లో, ఒక ఫోర్) ఈ మ్యాచ్‌లో కూడా విఫలం అయ్యాడు. అయితే మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, వన్ డౌన్ బ్యాటర్ ఫకార్ జమాన్ హాంగ్ కాంగ్ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు.


వీరిద్దరూ రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అనంతరం ఫకార్ జమాన్ అవుటైనా... చివర్లో ఖుష్‌దిల్ సిక్సర్లతో చెలరేగడంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. హాంగ్ కాంగ్ బౌలర్లలో రెండు వికెట్లూ ఎహ్‌సాన్ ఖాన్‌కే దక్కాయి.


అనంతరం హాంగ్ కాంగ్‌ను పాక్ బౌలర్లు ఒక ఆటాడుకున్నారు. హాంగ్ కాంగ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 10 పరుగులు చేయలేకపోయారు. అందరి కంటే అత్యధికంగా స్కోరు వచ్చింది ఎక్స్‌ట్రాల ద్వారా (10) మాత్రమే కావడం పాక్ బౌలర్లు ఏ స్థాయిలో చెలరేగారో చెబుతుంది.


పాక్ బౌలర్లలో ఒక్కరు కూడా 10 కంటే ఎక్కువ పరుగులు ఇవ్వలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో హాంగ్ కాంగ్ 38 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో షాదబ్ ఖాన్ నాలుగు, మహ్మద్ నవాజ్ మూడు, నసీం షా రెండు, షానవాజ్ దహానీ ఒక వికెట్ తీసుకున్నారు.