IND vs PAK: ఆసియా కప్ - 2023లో భాగంగా భారత్ - పాకిస్తాన్ మధ్య శనివారం పల్లెకెలె వేదికగా ముగిసిన  మ్యాచ్‌లో ఫలితం తేలకుండా   అర్థాంతరంగా రద్దు అయింది.  అయితే మ్యాచ్‌కు ముందు,  తర్వాత  భారత ఆటగాళ్లు  పాకిస్తాన్ ఆటగాళ్లతో క్లోజ్‌గా మూవ్ అవడం ఇరుజట్ల ఆటగాళ్ల అభిమానులను అలరించినా  టీమిండియా మాజీ  ఓపెనర్, ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ నుంచి  బీజేపీ ఎంపీగా ఉన్న గౌతం గంభీర్‌కు మాత్రం నచ్చలేదు.   ఆటగాళ్ల మధ్య స్నేహం ఉంటే  అది బౌండరీ లైన్ ఆవలే ఉండాలని, ఫీల్డ్‌లోకి దిగితే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే మాదిరిగా ఉండాలని అంటున్నాడు. 


ఈ మ్యాచ్‌లో స్టార్ స్పోర్ట్స్ తరఫున  కామెంటేటర్‌గా వ్యవహరించిన గంభీర్.. భారత-పాక్ ఆటగాళ్ల  స్నేహంపై మాట్లాడుతూ.. ‘మీరు జాతీయ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు   ప్రత్యర్థి జట్టుతో మీ స్నేహాన్ని  బౌండరీ రోప్స్ ఆవలే వదిలేయాలి.  ఆటను  ఎదుర్కోవాలి.  ఇరు జట్ల ఆటగాళ్ల కళ్లల్లో ఆటకు సంబంధించిన దూకుడు కనబడాలి.   మ్యాచ్ ఆడే ఆరేడుగంటల తర్వాత మీరు ఫ్రెండ్స్ కావొచ్చు. కానీ మైదానంలో మాత్రం  ఆటగాళ్లే. మ్యాచ్ జరిగే ఆ నిర్దేశిత సమయం  చాలా కీలకం.. ఎందుకంటే మీరు ప్రాతినిథ్యం వహించేది మీ వ్యక్తిగతానికి కాదు.. దేశం తరఫున ఆడుతున్నారు అనేది గుర్తుంచుకోండి. కోట్లాది మంది ప్రజల తరఫున మీరు ఆడుతున్నారు’ అని  తెలిపాడు. 


 






ప్రస్తుతం క్రికెట్‌లో ఆటగాళ్లు,  దాయాదులుగా చెప్పుకునే జట్ల ప్లేయర్ల మధ్య స్నేహం ఎక్కువగా కనిపిస్తున్నదని, కానీ కొన్నేండ్ల క్రితం మాత్రం ఇలా ఉండేది కాదని  గంభీర్ అన్నాడు. ఆడేది ఫ్రెండ్లీ మ్యాచ్ కాదన్న విషయాన్ని మ్యాచ్ ఆడే ఇరు జట్లూ గుర్తుంచుకోవాలని గంభీర్  వ్యాఖ్యానించాడు. గతంలో  తాను క్రికెట్ ఆడేటప్పుడు ఇదే ఫార్ములాను పాటించేవాడినని, తనకు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా విబేధాలు ఉన్నా  మైదానం ఆవల  వాటిని పట్టించుకోనని  చెప్పాడు. గతంలో ఆసియా కప్ - 2010లో తాను పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్‌తో గొడవపడినా  తనతో  స్నేహం ఇప్పటికీ కొనసాగిస్తున్నానని గంభీర్  అన్నాడు.






‘నేను, కమ్రాన్ మంచి స్నేహితులం.  అతడు నాకు ఓ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. నేను కూడా ఒక బ్యాట్‌ను ఇచ్చాను. కమ్రాన్ ఇచ్చిన బ్యాట్‌తోనే నేను ఒక సీజన్ మొత్తం ఆడాను.మేం కొద్దిరోజుల క్రితమే దాదాపు గంటసేపు మాట్లాడుకున్నాం’ అని  గంభీర్ వివరించాడు. కాగా ఫలితం తేలకున్నా నిన్నటి మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాటర్లను దెబ్బకొట్టిన పాకిస్తాన్.. పైచేయి సాధించి సూపర్ -4కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. 


























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial