Team India WC Squad: పెద్దగా సంచలన మార్పులేమీ లేకుండానే  భారత వన్డే వరల్డ్ కప్ టీమ్ సిద్ధమైనట్టు సమాచారం. ఆసియా కప్‌లో ఎంపిక చేసిన 18 మంది సభ్యులలోనే 15 మెంబర్స్‌ను ఎంపికచేస్తామని ఇదివరకే   ఆలిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్  హింట్ ఇచ్చిన నేపథ్యంలో  అనూహ్య మార్పులకు   సెలక్టర్లు చోటివ్వలేదని తెలుస్తున్నది.  ప్రస్తుతం ఆసియా కప్‌ ఆడేందుకు  శ్రీలంకలో ఉన్న భారత జట్టు (18 మంది సభ్యుల)లో  కేరళ  వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, ఆంధ్రా యువ సంచలనం తిలక్ వర్మలతో పాటు  పేసర్ ప్రసిధ్ కృష్ణలకు చోటు లేదనే సమాచారం. కానీ ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన   కెఎల్ రాహుల్ మాత్రం 15 మంది సభ్యులలో చోటు  ఖాయం చేసుకున్నాడట.. 


ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనం మేరకు.. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్  జట్టును ఫైనల్ చేసేందుకు గాను శ్రీలంకకు వెళ్లాడు. కెప్టెన్  రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌లను కలుసుకుని ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని పూర్తిచేసి  త్వరలోనే  వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనబోయే భారత జట్టును ప్రకటించనున్నారు. 


ఐసీసీ నిబంధనల ప్రకారం వరల్డ్ కప్ ఆడబోయే పది జట్లూ సెప్టెంబర్ 5 వరకు తమ 15 మందితో కూడిన జట్టును ప్రకటించాలి.  తర్వాత వారిలో ఏమైనా మార్పులు ఉంటే టెక్నికల్ కమిటీ అనుమతి తీసుకుని మార్చుకునే అవకాశం ఉంటుంది.  గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో  అగార్కర్ ఫైనల్ - 15ను  ఖాయం  చేసేందుకే లంకకు వెళ్లినట్టు తెలుస్తున్నది. క్యాండీలో శనివారం భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా అర్థాంతరంగా రద్దు అయిన తర్వాత   అగార్కర్.. రోహిత్, ద్రావిడ్‌లతో సమావేశం అయినట్టు తెలుస్తున్నది. 


ఇక జట్టు విషయానికొస్తే వన్డేలలో ఇంకా లయను దొరకబుచ్చుకోని  సూర్యకుమార్ యాదవ్‌కు ప్రపంచకప్‌ టీమ్‌లో చోటు దక్కింది.  శాంసన్‌కు మరోసారి  వామహస్తమే మిగలగా  యువ ఆటగాడు తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలు కూడా వరల్డ్ కప్ టీమ్ లో లేరు.  యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. కెఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఉండనున్నాడు. కెఎల్ రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో  ఉన్నాడు. ఎన్‌సీఏ మెడియకల్  టీమ్ రాహుల్‌ ఫిట్‌నెస్ ఇచ్చిన తర్వాత  బీసీసీఐ.. జట్టును ప్రకటించే అవకాశం ఉంది.  అన్నీ అనుకూలిస్తే  సెప్టెంబర్ 4నే  భారత జట్టును ప్రకటించనున్నారని బీసీసీఐ వర్గాల సమాచారం. 


బ్యాటర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ,  శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ భారత బ్యాటింగ్ భారాన్ని మోస్తారు.  కెఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా ఉండనున్నాడు. ఆల్ రౌండర్ల స్థానంలో హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా  అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులో ఉండే అవకాశం ఉంది.  పేసర్లుగా  జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ  బౌలింగ్ భారాన్ని మోస్తారు.  కుల్దీప్ యాదవ్ స్పిన్నర్‌గా సేవలందించనున్నాడు. 






వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ,  శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్  పాండ్యా,  రవీంద్ర జడేజా,  శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్






















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial