India vs Pakistan: భారత్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్ పాక్ ‌మ్యాచ్ మరోసారి జరిగే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు జరగొచ్చు. భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు. చిరకాల ప్రత్యర్థులు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం ఆపేసినా ఆయా దేశాల మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉండే డిమాండ్ వేరు. భారత్-పాక్ మ్యాచ్ కోసం ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తుంటారు. ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు పోటీ పతున్నారని తెలిసి ఇరు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. అయితే మ్యాచ్ కాస్తా వర్షార్పణం అయ్యింది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాచ్‌పై వరుణదేవుడు వర్షపు నీరు చల్లాడు.


అయితే మ్యాచ్ జరగలేదని ఫీల్ అయ్యేవారికి ఒక గుడ్ న్యూస్. ఆసియా కప్‌లో దాయాది దేశాలు మరోసారి తలపడే అవకాశం ఉంది. భారత్ - పాక్ మ్యాచ్ జరిగే చాన్స్ ఉంది. అన్నీ అనుకూలిస్తే రెండు కూడా జరగొచ్చు. ఎలాగంటే ప్రస్తుతం ఆసియా కప్ పోటీల్లో ఆరు దేశాలు పోటీ పడుతున్నాయి. రెండు గ్రూపుల్లో మూడు చొప్పున దేశాలు ఉన్నాయి. ప్రతి గ్రూపులో మూడు దేశాలు  రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఆయా గ్రూపుల్లోల తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఫోర్‌కు అర్హత సాధిస్తాయి. అక్కడ కూడా మ్యాచ్‌లు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లోనే జరుగుతాయి. ఒక్క జట్టు మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. 


రేపు నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే భారత్ సూపర్ ఫోర్‌కు చేరుకుంటుంది. ఎలాగో పాకిస్తాన్‌‌ ఇప్పటికే అర్హత సాధించింది. ఈ రెండు జట్లు సూపర్ ఫోర్‌లో తలపడనున్నాయి. సెప్టెంబర్ 10న కొలంబో లోని ప్రేమదాస స్టేడియంలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. అలాగే సూపర్ ఫోర్‌లో కూడా భారత్, పాక్ జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిస్తే సెప్టెంబర్ 17న కప్పుకోసం పోటీ పడే అవకాశం ఉంది. ఇవన్నీ జరగాలంటే మొదటగా సోమవారం నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలి.   


భారత్ పాక్ మ్యాచ్ వర్షార్పణం
ఆసియా కప్‌ 2023లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.  పల్లెకెల స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. కానీ ఇన్నింగ్స్ బ్రేక్‌లో ప్రారంభం అయిన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో మ్యాచ్ నిలిపివేయక తప్పలేదు. దాదాపు 10 గంటల వరకు మ్యాచ్ నిర్వహించడానికే ప్రయత్నించారు. కానీ ఎడతెరపని వర్షం కారణంగా ఇది సాధ్యం కాలేదు.


మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ సాయంత్రం 7:45 గంటలకు ముగిసింది. అయితే వెంటనే 7:50 గంటలకే వర్షం ప్రారంభం అయింది. రాత్రి 8:30 గంటలకు వర్షం కాస్త తెరిపిని ఇచ్చింది. ఆ సమయంలో మ్యాచ్ అధికారులు గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడారు. తొమ్మిది గంటల సమయంలో పిచ్‌ను పరీక్షించాలని అనుకున్నారు. ఒకవేళ వర్షం తగ్గితే 25 నుంచి 30 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించాలని అనుకున్నారు.


ఎంతకీ తగ్గకపోవడంతో...
కానీ ఆ తర్వాత వర్షం మళ్లీ ప్రారంభం అయింది. అస్సలు తగ్గలేదు. రాత్రి 10:30 సమయానికి మ్యాచ్ నిర్వహించడం సాధ్యమైతే 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని కటాఫ్‌గా పెట్టుకున్నారు. కానీ వర్షం తగ్గేలా కనిపించలేదు. దీంతో దాదాపు 10 గంటల సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.