IND vs PAK Asia Cup 2023: ఆసియా కప్ - 2023లో భారత్ ఆడే మ్యాచ్‌లకు వరుణుడు పదే పదే ఆటంకం కలిగిస్తుండటంతో తీవ్ర అసహనంగా ఉన్న క్రికెట్ అభిమానులు వారి కోపాన్ని  ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా మీద చూపెడుతున్నారు.  భారత్  - పాక్ మ్యాచ్ వరుసగా రెండోసారి కూడా వర్షార్పణమైన నేపథ్యంలో అభిమానులు ఆగ్రహోక్తులవుతున్నారు. దీనికంతటికీ కారణం జై షానే అని  ఏసీసీ ప్రెసిడెంట్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. 


ఈ సీజన్‌లో శ్రీలంకలో వర్షాలు పడతాయని తెలిసి కూడా  ఆసియా కప్‌‌ను అక్కడ నిర్వహిస్తున్న ఏసీసీపై  నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ  టోర్నీ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్ వద్ద ఉండగా  భద్రతా కారణాల దృష్ట్యా ఆ దేశం వెళ్లేందుకు  భారత్ నిరాకరించడంతో   మ్యాచ్‌లను  యూఏఈలో గానీ బంగ్లాదేశ్ లో అయినా నిర్వహించాలని  సూచించినా  అలా కాకుండా లంకను ఎంచుకున్నందుకు గాను అభిమానులు  జై షా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ట్విటర్ వేదికగా  పలువురు అభిమానులు కాస్త  ఘాటుగానే కామెంట్స్ పెడుతున్నారు. ట్విటర్‌లో  ఓ క్రికెట్ ఫ్యాన్ జై షా ఫోటో పెట్టి... ‘ఇదిగో ఈయనే జై షా.  నెపొటిజం ప్రొడక్ట్. బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ ప్రెసిడెంట్. ఆసియా కప్‌లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లను యూఏఈలో గానీ, బంగ్లాదేశ్, నేపాల్‌లో గానీ నిర్వహిస్తే బాగుండేది. ఈ వర్షం ముప్పు తప్పేది.  కానీ ఈ అసమర్థ, సిగ్గులేని వ్యక్తి మాత్రం వర్షాలు కురిసే ముప్పు ఉందని తెలిసినా  శ్రీలంకను ఎంచుకున్నాడు.  అందుకే మనకు క్రీడలలో అర్హత కలిగిన వ్యక్తులను ఉన్నత పోస్టులలో నియమించుకోవడం అవసరం.  ఈ పోస్టుకు వెంకటేశ్ ప్రసాద్ అయితే కరెక్ట్..’అని కామెంట్ చేశాడు.  


 






మరో అభిమాని.. ‘మరో భారత్ - పాక్ పోరు  వర్షార్పణమైంది.   శ్రీలంకలో వర్షాలు కురిసే ముప్పు ఉందని తెలిసినా   జై షా పట్టుబట్టి అక్కడే టోర్నీని నిర్వహించేలా  చేశాడు.   దీనికంతటికీ కారణం  జై షా నే..  అతడు వెంటనే రిజైన్ చేయాలి’ అని   ట్వీట్ చేశాడు.


 






జై షా పేరు ప్రస్తావించకపోయినా  ఇటీవలి కాలంలో  బీసీసీఐ మీద కారాలు మిరియాలు నూరుతున్న  వెంకటేశ్ ప్రసాద్ కూడా  ఆసక్తికర ట్వీట్స్‌తో  వార్తల్లో నిలిచాడు.  ప్రపంచకప్‌లో టికెట్ల  అమ్మకం,  ఆసియా కప్‌లో మ్యాచ్ నిర్వహణ, తదితర విషయాలపై చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది.  ‘అవినీతికి దూరంగా  ఉండే ఒక సంస్థ శ్రమను వృథా చేయడానికి  మొత్తం నాయకత్వంపైనే అవినీతి మరక  పడటానికి అవినీతిపరుడైన ఒక అహంభావి చాలు’అంటూ   ప్రసాద్ చేసిన ట్వీట్ కలకలం రేపింది.   ఇది జై షా ను ఉద్దేశించి చేసిందేనని    నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial