ODI World Cup  2023: ‘భారత క్రికెట్ జట్టు నుంచి యువరాజ్ సింగ్ నిష్క్రమణ తర్వాత మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో  ఎవరూ కుదురుకోవడం లేదు..’ ఈ మాటలన్నది ఎవరో కాదు స్వయంగా   టీమిండియా సారథి రోహిత్ శర్మనే. 12 ఏండ్ల తర్వాత భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌లో కీలకంగా వ్యవహరిస్తాడనుకుంటున్న శ్రేయాస్ అయ్యర్ గాయాలతోనే సావాసం చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్‌లో వెన్ను గాయంతో  ఇబ్బందిపడుతూ ఈ  ఏడాది ఏప్రిల్‌లో శస్త్రచికిత్స చేయించుకున్న  అయ్యర్ తాజాగా  ఆసియా కప్‌ సూపర్ - 4‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన  మ్యాచ్‌లో అతడు ఆడకపోవడం టీమిండియా ఫ్యాన్స్‌లో ఆందోళన రేపుతోంది. అసలు అయ్యర్ పూర్తిస్థాయిలో కోలుకున్నాడా..? లేకుంటే వరల్డ్ కప్ ఉందని  బీసీసీఐ హడావిడిగా అతడిని తీసుకొచ్చిందా..?  


మిడిలార్డర్‌లో కీలకం.. 


2017లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్.. ఇప్పటివరకూ 44 మ్యాచ్‌లలో ఆడాడు. 39 ఇన్నింగ్స్‌లలో  1,645 పరుగులు చేశాడు.  శ్రేయాస్ బ్యాటింగ్ సగటు (45.69) కూడా ఆరోగ్యకరంగానే ఉంది. నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఇన్నింగ్స్‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆడటంలో  శ్రేయాస్ ఇటీవల కాలంలో మెరుగయ్యాడు. ముఖ్యంగా  2022 నుంచి  అయ్యర్ భారత వన్డే జట్టులో  రెగ్యులర్ మెంబర్ అవడమే గాక టీమ్‌కు ఆపద్భాంధవుడిగా మారాడు. 


గడిచిన పది ఇన్నింగ్స్‌లలో  శ్రేయాస్..  28, 80, 49, 24, 82, 3, 28, 28, 38, 14  పరుగులు సాధించాడు.  ఈ ఏడాది శ్రీలంకతో  జనవరిలో జరిగిన  మూడు వన్డేలలో (28, 28, 38) ఫర్వాలేదనిపించిన అయ్యర్..  ఆ తర్వాత వెన్ను గాయానికి సర్జరీ చేయించుకుని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌‌సీఏ) లో రిహాబిటేషన్  పొందాడు.   ఆసియా కప్‌లో  రీఎంట్రీ ఇవ్వకముందు  జనవరిలో శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడిన అయ్యర్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో  రెండు ఫోర్లు కొట్టి  మంచి టచ్‌లోనే  కనిపించాడు. నేపాల్‌తో మ్యాచ్ ఆడినా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.  ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు మళ్లీ  ఇన్నాళ్లు వేధించిన గాయంతోనే  ఇబ్బందిపడుతూ బెంచ్‌కే పరిమితమయ్యాడు.  


 






టీమిండియాకు కష్టాలే..


అయ్యర్ గాయం గనక మళ్లీ తిరగబెడితే అది భారత్‌కు కష్టాలు తెచ్చిపెట్టేదే.   మిడిల్ ఓవర్లలో  బాదడం కంటే ముఖ్యం  బాధ్యతగా ఆడటం. స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌లపై స్పిన్నర్లను ఆడటంలో కూడా అయ్యర్ సిద్ధహస్తుడు.  ఓపెనర్లు దూకుడుగా ఆడి  ఔటైతే  మిడిలార్డర్‌లో ఇన్నింగ్స్‌ను  పునర్నిర్మించడం కీలకం. ఆఖరి వరకూ ఉంటే ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో కూడా అయ్యర్‌కు ఎరుకే.  వన్డే ప్రపంచకప్‌కు సూర్యకుమార్ యాదవ్ ఎంపికైనా ఈ ఫార్మాట్‌లో అతడికి ఉన్న పేలవ ఫామ్ దృష్ట్యా  సూర్యను తుది జట్టులో ఆడించడం అనుమానమే.  కెఎల్ రాహుల్ కూడా గాయం నుంచి కోలుకుని  ఆసియా కప్‌లోనే ఎంట్రీ ఇచ్చాడు.  అతడి ఫిట్నెస్‌పైనా సందేహాలున్నాయి.  ఈ నేపథ్యంలో రాహుల్ కంటే ముందుగానే కోలుకున్న అయ్యర్.. తిరిగి గాయంతో ఇబ్బందిపడుతుండటం టీమిండియాను కలవరపరిచేదే. 


అయ్యర్ ఇంతవరకూ భారత్ తరఫున  ఒక్క ఐసీసీ టోర్నీ కూడా ఆడలేదు.  గడిచిన ఆరేండ్లలో అతడు మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నా కీలక టోర్నీల ముందు ఫామ్ కోల్పోవడం, గాయపడటం వంటి వాటితో దూరమవుతున్నాడు. 2022 నుంచే అతడు వన్డేలలో రెగ్యులర్ ప్లేయర్ అయ్యాడు.  2022 నుంచి  ఇప్పటివరకూ 19 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ 832 పరుగులు సాధించాడు. సూర్య,  కెఎల్ రాహుల్ వంటివారితో పోల్చితే అయ్యర్ సగటుతో పాటు చేసిన పరుగులు కూడా ఎక్కువే. అటువంటి అయ్యర్  తిరిగి గాయపడితే అది భారత్‌కు ఎదురుదెబ్బ తాకినట్టే.. మరి వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా  మూడు వారాల సమయమే ఉండటంతో అప్పటివరకైనా అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా..?  తిరిగి మునపటి ఫామ్‌ను సంతరించుకోగలడా..? అనేది ఆసక్తికరంగా మారింది.  


 






 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial