US Open 2023: ఆధునిక టెన్నిస్ ప్రపంచపు దిగ్గజం,  సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్   సాధించాడు.   టెన్నిస్‌లో ఓపెన్ ఎరా ప్రారంభమయ్యాక అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన  క్రీడాకారిణిగా ఉన్న  మార్గరెట్ కోర్టు (24) రికార్డును సమం చేసి  కొత్త చరిత్ర సృష్టించాడు.  యూఎస్ ఓపెన్‌ నెగ్గి  కెరీర్‌‌లో 24వ గ్రాండ్‌స్లామ్ గెలవాలనే   కలతో బరిలోకి దిగిన  రెండో సీడ్  జకో.. దానిని సాకారం చేసుకున్నాడు. ఆదివారం   న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలోని పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో  జకోవిచ్..  6-3, 7-6 (7-5), 6-3 తేడాతో  మూడో సీడ్, రష్యాకు చెందిన డానియల్ మెద్వెదెవ్‌ను ఓడించాడు. ఇది  జకోకు   పదో  యూఎస్ ఓపెన్ ఫైనల్ కాగా  నాలుగో టైటిల్. మొత్తంగా కెరీర్‌లో  24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం గమనార్హం. 


న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో  ఆదివారం రాత్రి ముగిసిన తుదిపోరులో  జకో  ఆది నుంచే జోరు కొనసాగించాడు.  తొలి గేమ్‌ను  అలవోకగా గెలుచుకున్న  జకోకు రెండో గేమ్‌లో మాత్రం మెద్వెదెవ్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది.  పుంజుకున్న మెద్వెదెవ్  ఆ గేమ్‌ను గెలచుకునే విధంగా  కనిపించాడు.  కానీ  కిందపడ్డ ప్రతీసారి ఉప్పెనలా పైకి లేచే జకో మరోసారి జూలు విదిల్చాడు.  రెండో గేమ్‌ను కూడా సొంతం చేసుకున్న అతడు.. మూడో గేమ్‌లో   మరింత రెచ్చిపోయాడు. రెండో సెట్‌లో కాస్త ప్రతిఘటించిన మెద్వెదెవ్..  చివరి సెట్‌లో మాత్రం తేలిపోయాడు. 2021లో  ఇదే కోర్టులో జకోవిచ్‌ను ఓడించిన మెద్వెదెవ్.. తాజా పోరులో మాత్రం చిత్తయ్యాడు. ఈ ఏడాది జకోకు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ కావడం విశేషం. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ నెగ్గిన జకో.. వింబూల్డన్‌లో మాత్రం అల్కరాజ్ (స్పెయిన్) చేతిలో  ఓడాడు. 


సెరెనా రికార్డు బ్రేక్.. మార్గరెట్‌‌తో సమం.. 


ఈ టోర్నీకి ముందు టెన్నిస్‌లో అత్యధిక  గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన  ఆటగాళ్ల  జాబితాలో  జకోవిచ్.. 23 టైటిళ్లతో  అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ (23)తో సమానంగా ఉన్నాడు.   యూఎస్ ఓపెన్ కూడా గెలవడంతో  జకో.. సెరెనాను అధిగమించి  ఆస్ట్రేలియాకు చెందిన మార్గరెట్ కోర్టు పేరిట ఉన్న 24 టైటిళ్ల రికార్డును సమం చేశాడు.  మరో టైటిల్ నెగ్గితే జకో.. టెన్నిస్‌లో 25 టైటిళ్లతో ఈ రికార్డు సాధించిన  తొలి ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు.


 






టెన్నిస్‌లో అత్యధిక  గ్రాండ్‌స్లామ్స్ (టాప్-5) 


- మార్గరెట్ కోర్ట్ (24 టైటిళ్లు) 
- నొవాక్ జకోవిచ్ (24)
- సెరెనా విలియమ్స్ (23)
- రఫెల్ నాదల్ (22)
- స్టెఫీ గ్రాఫ్ (22) 


జకోవిచ్ గెలిచిన గ్రాండ్‌స్లామ్స్ వివరాలు.. 


- ఆస్ట్రేలియా ఓపెన్ - 10
- ఫ్రెంచ్ ఓపెన్ - 03
- వింబూల్డన్ - 07
- యూఎస్ ఓపెన్ - 04


 






ప్రైజ్ మనీ.. 


యూఎస్ ఓపెన్ - 20‌23 టైటిల్ గెలవడం ద్వారా జకోవిచ్‌కు  రూ. 25 కోట్ల ప్రైజ్ మనీ  దక్కింది. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial