IND vs PAK Weather Today: అనుకున్నదే అయింది. దాయాదుల పోరును జరగనిచ్చేది లేదని ప్రతిజ్ఞ పూనిన వరుణుడు అనుకున్నంత పనిచేశాడు. పదిరోజుల క్రితం పల్లెకెలెలో భారత్ - పాక్ మ్యాచ్‌ను అర్థాంతరంగా నిలిపేసిన వరుణుడు.. ఆదివారం కొలంబోనూ కమ్మాశాడు. పల్లెకెలెలో అయినా సగం ఆటకు అవకాశమిచ్చిన వరుణుడు.. ఆదివారం చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన సూపర్ - 4 పోరులో మాత్రం పావు వంతు ఆట కూడా సాగనివ్వలేదు. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉందని ఫ్యాన్స్ సంబురపడేంత అవకాశం కూడా లేదు. ఈ మ్యాచ్ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అన్నింటిపైనా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. నిన్న వదలని వాన నేడూ అంతరాయాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.
ఆదివారం భారత్ - పాక్ మధ్య ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 24.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఆట ముగిసేసమయానికి విరాట్ కోహ్లీ (16 బంతుల్లో 8 బ్యాటింగ్), కెఎల్ రాహుల్ (28 బంతుల్లో 17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వర్షం వల్ల ఆట సాగకపోయినా రిజర్వ్ డే అయిన నేడు.. నిన్న ఆట ఎక్కడ ఆగిందో అక్కడ్నుంచే మొదలవుతుంది.
నేడూ దంచుడే..
రిజర్వ్ డే ఉందని ఫ్యాన్స్ ఆనందపడ్డా వాళ్లకు ‘అంతొద్దు.. నేను ఇక్కడే ఉన్నా’ అంటూ హెచ్చరిస్తున్నాడు. నేడూ కొలంబోలో వర్షం కురిసే అవకాశాలు 80 శాతానికి పైమాటే. నిన్నటిమాదిరిగానే కొలంబోలో నేడూ ఉదయం పూట ఎండకాచింది. ఆకాశంలో మబ్బులు పట్టినట్టు కూడా కనిపించలేదు. కానీ నిన్న వాతావరణం ఇంతకంటే బాగానే ఉన్నా తీరా మ్యాచ్ ఆరంభమై 24 ఓవర్లు అయ్యాక ఏదో ముంచుకుపోయినట్టు వరుణుడు ఉన్నఫళంగా కొలంబోను ముంచెత్తాడు. నేడూ అవే సీన్స్ రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. స్థానిక వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటల వరకూ కొలంబోలో వర్షాలు పడే అవకాశం 49 శాతం ఉండగా సాయంత్రం 4 నుంచి 6 వరకూ 73 శాతం ఉంది. ఇక రాత్రి 8 తర్వాత అయితే వర్షం కురిసే అవకాశాలు వంద శాతం ఉన్నాయి. అంటే ఈ లెక్కన చూస్తే ఇవాళ కూడా మ్యాచ్ జరిగే అవకాశాలు దాదాపు లేనట్టే.
మ్యాచ్ రద్దు అయితే..
ఆట సాగడానికి వరుణుడు ఏదైనా అవకాశమిచ్చి ఒక్క ఇన్నింగ్స్ అయినా పూర్తై పాకిస్తాన్‌ను 20 ఓవర్లైనా ఆడనిస్తే అప్పుడు ఫలితం తేలే ఛాన్స్ ఉంది. ఇవేవీ లేక మ్యాచ్ వర్షార్పణం అయితే మాత్రం అధికారికంగా రద్దు చేయాల్సిందే. అప్పుడు ఇరు జట్లకూ తలా ఓ పాయింట్ ఇస్తారు. ఇలా అయితే ఫైనల్ చేరే క్రమంలో భారత్‌తో పాటు పాకిస్తాన్‌కూ తిప్పలు తప్పవు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial