Ruturaj Gaikwad Ruled Out: 


టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ! ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీసుకు దూరమవుతున్నాడు. కొన్ని రోజులుగా అతడు మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. అతడు దూరమైన విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అతడి గైర్హాజరీతో పృథ్వీ షా ఓపెనింగ్‌ చేసే అవకాశాలు మెరుగయ్యాయి.


ప్రస్తుతం రుతురాజ్‌ గైక్వాడ్‌ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీకి వెళ్లాడు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. అక్కడే రీహబిలిటేషన్‌ పొందుతాడు. అతడు చివరి సారిగా మహారాష్ట్ర, హైదరాబాద్‌ మధ్య రంజీ మ్యాచ్‌ ఆడాడు. వరుసగా 8, 0 పరుగులు చేశాడు. మ్యాచ్‌ ముగిశాక తన మణికట్టు పరిస్థితిని బీసీసీఐకి వివరించాడు. అతడు ఇలాంటి గాయంతో బాధపడటం ఇది రెండో సారి.


రుతురాజ్‌ గైక్వాడ్‌ మణికట్టు గాయంతోనే గతేడాది శ్రీలంకతో టీ20 మ్యాచుకు దూరమయ్యాడు. ఆ తర్వాత కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనారోగ్యం, గాయాల వల్ల గైక్వాడ్‌ అంతర్జాతీయ మ్యాచులకు తరచూ దూరమవుతుండటంతో బీసీసీఐ పెద్దలు, సెలక్షన్‌ కమిటీ నిరాశ చెందుతోందని తెలిసింది. ఏదేమైనా ఇప్పటి వరకు అతడి స్థానంలో మరొకరిని ఎంపిక చేయలేదు. అంటే ఈ సిరీసులో పృథ్వీ షా పునరాగమనం చేయడం ఖాయమే అనిపిస్తోంది.


జడ్డూకు ఫిట్‌నెస్‌ టెస్ట్‌!


టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సన్నద్ధతనూ సెలక్షన్‌ కమిటీ పరీక్షించనుంది. అతడు బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీకి సిద్ధంగా ఉన్నాడో లేడో సమీక్షిస్తుంది. ఎన్‌సీఏ ఫిబ్రవరి ఒకటిన వివిధ పరీక్షలు నిర్వహించి ఫిట్‌నెస్‌ నివేదిక ఇవ్వనుంది. మోకాలి గాయంతో జడ్డూ కొంత కాలం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. తిరిగి కోలుకొని దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నాడు. ప్రస్తుతం చెన్నైలో సౌరాష్ట్ర, తమిళనాడు మ్యాచ్‌ ఆడుతున్నాడు. ఫిబ్రవరి 2న టీమ్‌ఇండియా నాగ్‌పుర్‌లో ప్రీ సిరీస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయనుంది. ఆసీస్‌ టెస్టు సిరీసుకు అతడు అందుబాటులో ఉంటాడో లేదో అప్పుడే చెప్పనుంది.


టీ20 సిరీస్ జట్లు:


భారత్‌: హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, యుజ్వేంద్ర చాహల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, దీపక్‌ హుడా, ఇషాన్‌ కిషన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ముకేశ్ కుమార్‌, జితేశ్ శర్మ, పృథ్వీ షా, శివమ్‌ మావి, శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, ఉమ్రాన్‌ మాలిక్‌, వాషింగ్టన్‌ సుందర్‌


న్యూజిలాండ్‌: మిచెల్‌ శాంట్నర్‌ (కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌, బ్రాస్‌వెల్‌, మార్క్‌ చాప్‌మన్‌, డేన్‌  క్లీవర్‌, డేవాన్‌ కాన్వే, జాక్‌ డఫి, లాకీ ఫెర్గూసన్‌, బెంజమిన్‌ లిస్టర్‌, డరైల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మైకేల్‌ రిప్పన్‌, హెన్రీ షిప్లే, ఇష్‌ సోధి, బ్లెఇర్‌ టిక్నర్‌


టెస్టు సిరీస్ జట్లు:


భారత జట్టు : రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎస్ భరత్‌, ఇషాన్‌ కిషన్, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌


ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్‌ కమిన్స్‌, ఏస్టన్‌ ఆగర్‌, స్కాట్‌ బొలాండ్‌, అలెక్స్‌ కేరీ, కామెరాన్‌ గ్రీన్‌, పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌, జోష్ హేజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్ ఖవాజా, మార్నస్‌ లబుషేన్‌, నేథన్ లైయన్‌, లాన్స్‌ మోరిస్‌, టాడ్‌ మార్ఫీ, మాథ్యూ రెన్షా, స్టీవ్‌స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వెప్సన్‌, డేవిడ్‌ వార్నర్‌