IND vs AUS Test Series:


టీమ్‌ఇండియాకు బ్యాడ్‌ న్యూస్‌! పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని తెలిసింది. ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీకి అతడు పూర్తిగా అందుబాటులో ఉండడని సమాచారం. అతడు కోలుకోవడానికి మరికాస్త సమయం పడుతుందని ఎన్‌సీఏ పర్యవేక్షకులు అంచనా వేస్తున్నారు.


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు నుంచీ జస్ప్రీత్‌ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. వెన్నెముక గాయమే ఇందుకు కారణం. తీవ్రత ఎక్కువగా ఉండటంతో అత్యంత కీలకమైన ప్రపంచకప్‌ ఆడలేదు. శ్రీలంక సిరీసుకు ముందు అతడు ఫిట్‌నెస్‌ సాధించాడని ఎన్‌సీఏ తెలిపింది. సిరీస్‌కు ఎంపిక చేసింది. అయితే ముంబయిలో నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తుండగా అసౌకర్యంగా ఉన్నట్టు బుమ్రా ఫిర్యాదు చేశాడు. దాంతో ముందు జాగ్రత్త చర్యగా సిరీస్‌ నుంచి తప్పించారు. న్యూజిలాండ్ సిరీసులకూ ఎంపిక చేయలేదు.


స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీకి సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించారు. ఇందులో జస్ప్రీత్‌ బుమ్రా లేడు. కనీసం ఆఖరి రెండు టెస్టులకైనా అందుబాటులో ఉంటాడేమోనని కెప్టెన్‌ రోహిత్ శర్మ ఆశించాడు. కానీ పరిస్థితులు సహకరించడం లేదని తెలిసింది.


'ఆస్ట్రేలియా సిరీసుకు జస్ప్రీత్‌ బుమ్రా 100 శాతం ఫిట్‌గా ఉండటం కష్టమే. మేం ఎలాంటి సిరీస్‌ ఆడినా అతడి విషయంలో తొందరపడం. వెన్నెముక గాయాల నుంచి కోలుకోవడం సుదీర్ఘ ప్రక్రియ. ఇప్పటికైతే అతడు సెలక్షన్‌కు అందుబాటులో లేడు. పునరాగమనం ఎప్పుడు చేస్తాడో చెప్పలేం. బహుశా మరో నెల రోజులు పట్టొచ్చు' అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌కు తెలిపారు. న్యూజిలాండ్‌తో మూడో వన్డే తర్వాతా బుమ్రా గురించి రోహిత్‌ మాట్లాడటం గమనార్హం.


'బుమ్రా పునరాగమనం గురించి చెప్పలేను. ఆస్ట్రేలియాతో చివరి రెండు మ్యాచులు ఆడతాడని నా నమ్మకం. వెన్నెముక గాయాలు సంక్లిష్టంగా ఉంటాయి. అందుకే అతడి విషయంలో తొందరపడం. రిస్క్‌ తీసుకోం. ఆసీస్‌ సిరీస్‌ తర్వాతా మేం చాలా క్రికెట్‌ ఆడాల్సి ఉంది. ఎన్‌సీఏ వైద్యులు, ఫిజియోలను మేం నిరంతరం సంప్రదిస్తుంటాం. వైద్యబృందం బుమ్రాకు అవసరమైనంత సమయం ఇస్తుంది' అని హిట్‌మ్యాన్‌ వెల్లడించాడు.


మరికొన్ని రోజుల్లో భారత్‌, ఆస్ట్రేలియా అత్యంత కీలకమైన బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో తలపడుతున్నాయి. ఫిబ్రవరి 9 నుంచే నాలుగు టెస్టుల సిరీసు మొదలవుతోంది. టీమ్‌ఇండియా తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది. ఆసీస్‌ 18 మందిని ఎంపిక చేసింది.


భారత జట్టు : రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎస్ భరత్‌, ఇషాన్‌ కిషన్, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌


ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్‌ కమిన్స్‌, ఏస్టన్‌ ఆగర్‌, స్కాట్‌ బొలాండ్‌, అలెక్స్‌ కేరీ, కామెరాన్‌ గ్రీన్‌, పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌, జోష్ హేజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్ ఖవాజా, మార్నస్‌ లబుషేన్‌, నేథన్ లైయన్‌, లాన్స్‌ మోరిస్‌, టాడ్‌ మార్ఫీ, మాథ్యూ రెన్షా, స్టీవ్‌స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వెప్సన్‌, డేవిడ్‌ వార్నర్‌