IND vs NZ 3rd T20I: నేపియర్‌ టీ20లో న్యూజిలాండ్‌ను టీమ్‌ఇండియా బౌలర్లు భారీ దెబ్బకొట్టారు. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, యువ బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌ తలో నాలుగు వికెట్లతో చెలరేగారు. మిడిలార్డర్‌ మొత్తాన్నీ కుదేలు చేయడంతో ఆతిథ్య జట్టు 19.4 ఓవర్లకు 160కే ఆలౌటైంది. డేవాన్‌  కాన్వే (59; 49 బంతుల్లో 5x4, 2x6), గ్లెన్ ఫిలిప్స్‌ (54; 33 బంతుల్లో 5x4, 3x6) హాఫ్‌ సెంచరీలతో రాణించారు.




ఆదుకున్న కాన్వే, ఫిలిప్స్‌


వర్షం కురవడంతో మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా మొదలైంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 9 వద్దే ఫిన్‌ అలెన్‌ (3)ను అర్షదీప్‌ ఎల్బీ చేశాడు. స్వల్ప స్కోరుకే మార్క్‌ చాప్‌మన్‌ (12)ను సిరాజ్‌ ఔట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన డేవాన్‌ కాన్వే, గ్లెన్‌ ఫిలిప్స్‌ నిలకడగా ఆడి ఆతిథ్య జట్టును ఆదుకున్నారు. చక్కని బంతుల్ని డిఫెండ్‌ చేస్తూనే చెత్త బంతుల్ని వేటాడారు. 15 ఓవర్ల వరకు అసలు వికెట్టే ఇవ్వలేదు.




అర్షదీప్, సిరాజ్‌ వికెట్ల వేట


కాన్వే 39, ఫిలిప్స్‌ 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు బాదేసి మూడో వికెట్‌కు 63 బంతుల్లో 86 పరుగుల భాగస్వామ్యం అందించారు. ప్రమాదకరంగా మారిన ఫిలిప్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా సిరాజ్‌ విడదీశాడు. అప్పటికి స్కోరు 130. ఆ తర్వాతి ఓవర్లోనే 146 వద్ద కాన్వేను అర్షదీప్‌ ఔట్‌ చేశాడు. 147 వద్ద నీషమ్‌ (0), 149 వద్ద శాంట్నర్‌ (1), మిచెల్‌ (10), సోది (0), మిల్నె (0) పెవిలియన్‌ చేరారు. 19.4వ బంతికి సౌథీ (6) హర్షల్‌ పటేల్‌ బౌల్డ్‌ చేయడంతో 160కి కివీస్‌ కథ ముగిసింది.