IND vs NZ 3rd T20I:  భారత్ తో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ కొంచెం ఆలస్యమైంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ చెప్పాడు. వాతావరణం మబ్బుగా ఉంది కాబట్టి స్కోరు బోర్డు మీద వీలైనన్ని ఎక్కువ పరుగులు ఉంచడమే తమ లక్ష్యమని... అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు. విలియమ్సన్ స్థానంలో మార్క్ చాప్ మన్ జట్టులోకి వచ్చాడు. 


తాము టాస్ గెలిచినా కూడా బౌలింగే ఎంచుకునే వాళ్లమని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు. జట్టులో ఒక మార్పు చేశారు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో పేస్ బౌలర్ హర్షల్ పటేల్ ను తీసుకున్నారు.  


న్యూజిలాండ్ - భారత్ మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 నేడు నేపియర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకమైంది. రెండో మ్యాచులో కివీస్ పై గెలిచిన టీమిండియా... దీనిలోనూ విజయం సాధించి సిరీస్ గెలుచుకోవాలనుకుంటోంది. మరోపక్క న్యూజిలాండ్ ఇందులో నెగ్గి సిరీస్ కోల్పోకుండా కాపాడుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే 2-0 తో సిరీస్ గెలుస్తుంది. కివీస్ గెలిస్తే 1-1 తో సిరీస్ సమమవుతుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయింది. 


బ్యాటింగ్ లో సూర్య ఒక్కడే


రెండో టీ20లో టీమిండియా చేసిన మొత్తం పరుగులు 191. అందులో సూర్య చేసినవే 111. మిగిలిన బ్యాటర్లందరూ కలిపి చేసినవి 80. దీన్ని బట్టి చూస్తుంటేనే తెలుస్తోంది భారత్ బ్యాటింగ్ సూర్యకుమార్ పై ఎంత ఆధారపడి ఉందో. ఓపెనర్లలో ఇషాన్ పర్వాలేదనిపించగా.. పంత్ మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ దురదృష్టవశాత్తూ హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. ఇక పాండ్య అనుకున్నంత మేర ఆడలేదు. దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ లు చివరి ఓవర్లో వచ్చి ఒక్క బంతి మాత్రమే ఆడి ఔటయ్యారు. ఏదేమైనా టీమిండియా బ్యాటింగ్ ను చాలావరకు సూర్యనే మోస్తున్నాడు. ఒకవేళ అతను కూడా విఫలమైతే పరిస్థితి ఏంటో తెలియదు. కాబట్టి మిగతా బ్యాటర్లు కూడా బ్యాట్ ఝుళిపించాల్సిన అవసరం ఉంది. 


బౌలింగ్ ఓకే ఓకే


రెండో మ్యాచులో టీమిండియా బౌలింగ్ ఓకే అన్నట్లుగా సాగింది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ పొదుపుగా బౌలింగ్ చేయటంతోపాటు మొదటి ఓవర్లోనే వికెట్ తీశాడు. మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లతో పర్వాలేదనిపించాడు. అయితే ప్రధాన పేసర్ గా ఉన్న అర్హదీప్ మాత్రం తేలిపోయాడు. ధారాళంగా పరుగులివ్వడమే కాక ఒక్క వికెట్ కూడా తీయలేదు. స్పిన్నర్లలో చాహల్ ఆకట్టుకోగా.. వాషింగ్టన్ సుందర్ విఫలమయ్యాడు. అయితే అనూహ్యంగా పార్ట్ టైమర్ దీపక్ హుడా 4 వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా బౌలర్ల ప్రదర్శన ఆకట్టుకునేలా ఉంది. అయితే సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది.