Nicholas Pooran Steps Down: వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ నికోలస్ పూరన్ ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. తాను వన్డే, టీ20 క్రికెట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. జట్టులో సభ్యుడిగా కొనసాగుతానని చెప్పాడు. 


పూరన్ నాయకత్వంలోని విండీస్ జట్టు టీ20 ప్రపంచకప్ లో ఘోరంగా విఫలమైంది. క్వాలిఫయర్ మ్యాచుల్లో పసికూనలు ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్ల చేతుల్లో ఓడిపోయి సూపర్ 12 చేరకుండానే నిష్క్రమించింది. కెప్టెన్ నికోలస్ పూరన్ జట్టును నడిపించడంలోనూ, వ్యక్తిగతంగానూ తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్నాడు. 


టీ20 ప్రపంచకప్ వైఫల్యమే కారణం


మెగా టోర్నీలో జట్టు పరాభవానికి బాధ్యత వహిస్తూ పూరన్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. 'టీ20 ప్రపంచకప్ లో ఘోర వైఫల్యం తర్వాత నుంచి నేను కెప్టెన్సీ గురించి చాలా ఆలోచించాను. విండీస్ క్రిెకెట్ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నేను అంకితభావంతో నా బాధ్యతలను నిర్వర్తించాను. గతేడాదిగా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. అయితే ఎన్ని చేసినా మెగా టోర్నీలో సూపర్ 12 కూడా చేరలేకపోవడం సమర్ధనీయం కాదు. అందుకే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. అలానే మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కు సిద్ధం కావడానికి కొత్త కెప్టెన్ ను తయారు చేసేందుకు మా క్రికెట్ బోర్డుకు సమయం ఇవ్వాలనుకుంటున్నాను.' అని పూరన్ అన్నాడు. 


కెప్టెన్ గా తప్పుకున్నా ఆటగాడిగా జట్టుతో కొనసాగుతానని పూరన్ స్పష్టంచేశాడు. సీనియర్ ఆటగాడిగా  డ్రెస్సింగ్ రూములో సహచరులకు సూచనలు ఇస్తానని చెప్పాడు. 'నేను ఇంకా క్రికెట్ ఆడతాను. జట్టుతోనే కొనసాగుతాను. అలాగే మా టీం కు నా సేవలను అందించడానికి ఎదురుచూస్తున్నాను.' అని నికోలస్ పూరన్ అన్నాడు. 


తర్వాతి కెప్టెన్ అతడేనా!


నికోలస్ పూరన్ రాజీనామాతో వెస్టిండీస్ తర్వాతి కెప్టెన్ ఎవరనే ఆసక్తి నెలకొంది. కొత్త కెప్టెన్ గా రోవ్ మన్ పావెల్ పేరు ఖరారైందని తెలుస్తోంది. తాజాగా రోవ్‌మన్‌ పావెల్‌ సారథ్యంలోని జమైకా స్కార్పియన్స్‌ జట్టు 11 ఏళ్ల తర్వాత సూపర్‌-50 కప్‌ కైవసం చేసుకుంది. దీంతో జాతీయ జట్టు పగ్గాలు అతనికే అప్పజెప్పాలని అభిమానుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. శనివారం (నవంబర్‌ 19) జరిగిన సూపర్‌-50 కప్‌ ఫైనల్లో జమైకా స్కార్పియన్స్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు షాకిచ్చి టైటిల్‌ ఎగురేసుకుపోయింది. జమైకా స్కార్పియన్స్‌ టైటిల్‌ సాధించడంలో కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ కీలకంగా వ్యవహరించాడు.