IND vs NZ 3rd T20:  న్యూజిలాండ్ - భారత్ మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 నేడు నేపియర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకమైంది. రెండో మ్యాచులో కివీస్ పై గెలిచిన టీమిండియా... దీనిలోనూ విజయం సాధించి సిరీస్ గెలుచుకోవాలనుకుంటోంది. మరోపక్క న్యూజిలాండ్ ఇందులో నెగ్గి సిరీస్ కోల్పోకుండా కాపాడుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే 2-0 తో సిరీస్ గెలుస్తుంది. కివీస్ గెలిస్తే 1-1 తో సిరీస్ సమమవుతుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయింది. 


బ్యాటింగ్ లో సూర్య ఒక్కడే


రెండో టీ20లో టీమిండియా చేసిన మొత్తం పరుగులు 191. అందులో సూర్య చేసినవే 111. మిగిలిన బ్యాటర్లందరూ కలిపి చేసినవి 80. దీన్ని బట్టి చూస్తుంటేనే తెలుస్తోంది భారత్ బ్యాటింగ్ సూర్యకుమార్ పై ఎంత ఆధారపడి ఉందో. ఓపెనర్లలో ఇషాన్ పర్వాలేదనిపించగా.. పంత్ మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ దురదృష్టవశాత్తూ హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. ఇక పాండ్య అనుకున్నంత మేర ఆడలేదు. దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ లు చివరి ఓవర్లో వచ్చి ఒక్క బంతి మాత్రమే ఆడి ఔటయ్యారు. ఏదేమైనా టీమిండియా బ్యాటింగ్ ను చాలావరకు సూర్యనే మోస్తున్నాడు. ఒకవేళ అతను కూడా విఫలమైతే పరిస్థితి ఏంటో తెలియదు. కాబట్టి మిగతా బ్యాటర్లు కూడా బ్యాట్ ఝుళిపించాల్సిన అవసరం ఉంది. 


బౌలింగ్ ఓకే ఓకే


రెండో మ్యాచులో టీమిండియా బౌలింగ్ ఓకే అన్నట్లుగా సాగింది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ పొదుపుగా బౌలింగ్ చేయటంతోపాటు మొదటి ఓవర్లోనే వికెట్ తీశాడు. మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లతో పర్వాలేదనిపించాడు. అయితే ప్రధాన పేసర్ గా ఉన్న అర్హదీప్ మాత్రం తేలిపోయాడు. ధారాళంగా పరుగులివ్వడమే కాక ఒక్క వికెట్ కూడా తీయలేదు. స్పిన్నర్లలో చాహల్ ఆకట్టుకోగా.. వాషింగ్టన్ సుందర్ విఫలమయ్యాడు. అయితే అనూహ్యంగా పార్ట్ టైమర్ దీపక్ హుడా 4 వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా బౌలర్ల ప్రదర్శన ఆకట్టుకునేలా ఉంది. అయితే సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. 


వారిద్దరికీ అవకాశం వస్తుందా!


ఈ సిరీస్ లో భారత్ స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్, వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ సంజూ శాంసన్ లకు అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. అయితే రెండో మ్యాచ్ తుది జట్టులో వీరిద్దరూ ఆడలేదు. పంత్ ఓపెనర్ గానూ విఫలమయ్యాడు కాబట్టి సంజూకు ఛాన్స్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.మరి చివరిదైన మూడో టీ20లో అయినా వీరికి ఛాన్స్ ఇస్తారా లేదా చూడాలి.


న్యూజిలాండ్ రాణిస్తుందా!


భారత్ తో రెండో టీ20లో న్యూజిలాండ్ సమష్టిగా విఫలమైంది. బ్యాటర్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ తప్ప మిగతా వారెవరూ రాణించలేదు. డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ లు, డారిల్ మిచెల్ లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. బౌలింగ్ లోనూ ఆ జట్టు అంత ప్రభావంగా కనిపించడంలేదు. సీనియర్ బౌలర్ టిమ్ సౌథీ ఒక్కడే పర్వాలేదనిపించే ప్రదర్శన చేశాడు. లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులిచ్చాడు. ఇక మిగతా బౌలర్లు సూర్య ధాటికి విలవిల్లాడారు. దాదాపు 9 ఎకానమీతో పరుగులిచ్చుకున్నారు. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలంటే కివీస్ శక్తికి మించిన ప్రదర్శన చేయాల్సిందే. 


కేన్ దూరం


కొన్ని ఆరోగ్య పరీక్షల కోసం వైద్యుని వద్ద ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న కారణంగా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చివరి టీ20 కి దూరమవుతున్నట్లు ఆ జట్టు కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపారు. మూడో టీ20కి టిమ్ సౌథీ తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. 


భారత తుది జట్టు (అంచనా)


రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్/సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్) దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్.


న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)


ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్/మైఖేల్ బ్రేస్‌వెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ (కెప్టెన్), ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.


పిచ్ పరిస్థితి


ఈ మ్యాచుకు వర్షం ముప్పు లేదు. అయితే ఆకాశం మేఘావృతమై ఉంటుంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. 


మీకు తెలుసా:


- 2018లో రోహిత్ శర్మ  తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు T20I సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.


- ఇష్ సోధీ భారత్‌పై 21 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ జోర్డాన్‌తో కలిసి ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా ఉన్నాడు.