IND vs NZ 3rd T20: శుభ్ మన్ గిల్- ఈ భారత యువ బ్యాటర్ మరోసారి చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ తో వన్డేల్లో డబుల్ సెంచరీతో అదరగొట్టిన గిల్.. సిరీస్ డిసైడర్ అయిన చివరి టీ20లో శతకంతో రెచ్చిపోయాడు. గత రెండు టీ20ల్లోనూ నిరాశపరిచిన ఈ ఓపెనర్.. అసలైన మ్యాచ్ లో తన విశ్వరూపం చూపించాడు. శుభ్ మన్ గిల్ సెంచరీతో చెలరేగటంతో కివీస్ తో జరుగుతున్న మూడో టీ20లో భారత్ భారీస్కోరు సాధించింది.
23ఏళ్ల భారత యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి టీ20లో శతకంతో చెలరేగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. తన పేలవ ఫాం ను కొనసాగిస్తూ ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. అయితే వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి, శుభ్ మన్ గిల్ లు చెలరేగి ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఉన్నంతసేపు అదరగొట్టిన త్రిపాఠి 22 బంతుల్లో 44 పరుగులు చేసి ఇష్ సోధి బౌలింగ్ లో ఔటయ్యాడు. వచ్చీ రావడంతోనే 2 సిక్సులు కొట్టి ఊపు మీద కనిపించిన సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 24)ను టిక్నర్ వెనక్కు పంపాడు.
గిల్ విధ్వంసం
విధ్వంసకర సూర్య ఔటవటంతో స్కోరు నెమ్మదిస్తుందనుకుంటే అనూహ్యంగా గిల్ (63 బంతుల్లో 126) చెలరేగిపోయాడు. వన్డేల్లో డబుల్ సెంచరీతో అదరగొట్టినా.. తొలి 2 టీ20ల్లో ఆకట్టుకోలేకపోయిన ఈ ఓపెనర్ అసలైన మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. కళాత్మక షాట్లతో ఆకట్టుకుంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 52 బంతుల్లో తన తొలి టీ20 సెంచరీని సాధించాడు. ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన భారత ఐదో బ్యాటర్ గా నిలిచాడు. గిల్ కు తోడు కెప్టెన్ హార్దిక్ పాండ్య (30) కూడా భారీ షాట్లు కొట్టటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోరు సాధించింది.
న్యూజిలాండ్ బౌలర్లలో బ్రాస్ వెల్, టిక్నర్, సోధి, మిచెల్ తలా వికెట్ దక్కించుకున్నారు.
భారత జట్టు
శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ జట్టు
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఇష్ సోధి, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్