IPL 2023:  ఐపీఎల్- 2023 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే తన సన్నాహాలను ప్రారంభించాడు. గతేడాది ఐపీఎల్ తన చివరి సీజన్ అంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ ధోనీ ఈ సంవత్సరం ఐపీఎల్ ఆడనున్నాడు. ఈ క్రమంలోనే జట్టుతో కలిసి నెట్స్ లో సాధన చేస్తూ కనిపించాడు. నెట్స్ లో ఎంఎస్డీ కొడుతున్న భారీ సిక్సుల వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి. 


2022 ఐపీఎల్ సీఎస్కే ప్లేఆఫ్ చేరడంలో విఫలమైంది. 4 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై గతేడాది సరైన ప్రదర్శన చేయలేదు. ఆ సీజన్ లో చెన్నై జట్టు కెప్టెన్ గా రవీంద్ర జడేజా కొన్ని మ్యాచ్ లకు జట్టును నడిపించాడు. అయితే జడ్డూ నాయకుడిగా విఫలమవటంతో మళ్లీ టోర్నీ సగం నుంచి ధోనీనే కెప్టెన్ బాధ్యతలు నిర్వహించాడు. అయినప్పటికీ జట్టును ప్లేఆఫ్స్ చేర్చడంలో సఫలీకృతం కాలేదు. అప్పుడే ధోనీకిదే చివరి ఐపీఎల్ అంటూ గుసగుసలు వినిపించాయి. వాటన్నింటినీ తోసిపుచ్చుతూ ఈ ఏడాది ఐపీఎల్ ఆడుతున్నానంటూ మహీ ప్రకటించాడు. 


చెన్నైలో చివరి మ్యాచ్!


2019 తర్వాత తొలిసారి ఐపీఎల్ పూర్తి సీజన్ స్వదేశంలో జరగనుంది. తన హోం గ్రౌండ్ అయిన చెన్నైలో చివరి మ్యాచ్ ఆడుతూ అభిమానులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నట్లు ధోనీ తెలిపాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు 234 మ్యాచులు ఆడిన ధోనీ 39.2 సగటుతో 4978 పరుగులు చేశాడు. అందులో 229 సిక్సులు ఉన్నాయి. కెప్టెన్ గా చెన్నైకు 4 సార్లు ట్రోఫీని అందించాడు. 


తర్వాతి కెప్టెన్ అతడేనా!


ఈ ఏడాది వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ధోనీ తర్వాత జట్టును నడిపించే ఆటగాడిని కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను 16.25 కోట్లకు వేలంలో దక్కించుకుంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ స్టోక్స్ నే  ధోనీ తర్వాత సీఎస్ కే  కెప్టెన్ గా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్టోక్స్ తో పాటు మరో ఇద్దరు ప్రముఖ ఆటగాళ్లను సీఎస్కే కొనుగోలు చేసింది. కైల్ జేమీసన్, అజింక్య రహానేలను కోటి వెచ్చించి కొన్నది.