IND vs NZ, 3rd ODI- Full Match Highlights: మూడో వన్డేలోనూ టీమిండియా దుమ్మురేపింది. 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై రోహిత్ సేన ఘన విజయం సాధించింది. దాంతో న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 3-0 తో వైట్ వాట్ చేసింది టీమిండియా. ముందు బ్యాటింగ్, తరువాత బౌలింగ్ లో చెలరేగిన టీమిండియా పర్యాటక కివీస్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ జట్టు 41.2 ఓవర్లలో 295 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వే శతకం (138 ; 100 బంతుల్లో 12x4, 8x6)తో మెరిశాడు. హెన్రీ నికోల్స్ (42 ; 40 బంతుల్లో 3x4, 2x6), మిచెల్ శాంట్నర్ (34 ; 29 బంతుల్లో 3x4, 2x6) టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ చెరో 3 వికెట్లతో కివీస్ బ్యాటర్లను అడ్డుకున్నారు.






హోల్కర్‌ స్టేడియం హోరెత్తింది. ఇండోర్‌ నగరం దద్దరిల్లింది. స్టాండ్స్‌లోని ప్రేక్షకులు సిక్సర్ల వర్షంలో తడిసి ముద్దయ్యారు. బౌండరీల వరదకు థ్రిల్లయ్యారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (101; 85 బంతుల్లో 9x4, 6x6), శుభ్‌మన్‌ గిల్‌ (112; 78 బంతుల్లో 13x4, 5x6) సెంచరీలు బాదడంతో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసింది. మూడో వన్డేలో న్యూజిలాండ్‌ ముందు 386 పరుగుల టార్గెట్‌ ఉంచింది. ఆఖర్లో  హార్దిక్‌ పాండ్య (54; 38 బంతుల్లో 3x4, 3x6), శార్దూల్‌ ఠాకూర్‌ (25; 17 బంతుల్లో 3x4, 1x6) దంచికొట్టారు. టీమ్‌ఇండియా 385/9తో ఇన్నింగ్స్‌ ముగించింది.


టీమిండియా ఓపెనర్ల వీర విహారం.. హార్దిక్ జోరు
బ్యాటింగ్‌కు స్వర్గధామం అయిన అసలే హోల్కర్‌ స్టేడియంలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించారు. ఓపెనర్లిద్దరూ కొనసాగించడంతో పది ఓవర్లకే టీమ్‌ఇండియా 82/0తో నిలిచింది. తొలి వికెట్ కు 212 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక రోహిత్ ఔటయ్యాడు. శతకం బాదిన తరువాత బ్రాస్ వెల్ బౌలింగ్ లో రోహిత్ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ గిల్ సైతం శతకం తరువాత ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. టిక్నర్ బౌలింగ్ లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. వేగంగా ఆడే క్రమంలో కోహ్లీ (36) ను డఫ్ఫీ ఔట్ చేశాడు. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ త్వరగా ఓటైనా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (54; 38 బంతుల్లో 3x4, 3x6) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఓపికగా ఆడుతూ చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. చివర్లో వికెట్లు వేగంగా పడుతుంటే శార్దూల్ ఠాకూర్ 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాది స్కోరు బోర్డును నడిపించాడు. నిర్ణీత ఓవర్లలో 385 పరుగులు చేసి కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో సక్సె్స్ అయింది.


కివీస్ బౌలర్ సెంచరీ మార్క్..
టీమిండియా ఓపెనర్ల ధాటికి కివీస్ బౌలర్ జాకబ్ డఫ్ఫీ శతకం మార్క్ చేరాడు. బౌలర్ ఏంటి శతకం చేయడం అనుకుంటున్నారా, భారత ఓపెనర్లు రోహిత్, గిల్ వీర విహారానికి కివీస్ బౌలర్ డఫ్ఫీ 10 ఓవర్లలో 100 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే 3 వికెట్లు తీయడం విశేషం. టిక్నర్ సైతం 10 ఓవర్లలో 3 వికెట్లు తీసినా, 76 పరుగులు ఇచ్చాడు. శాంట్నర్, ఫెర్గూసన్ పరవాలేదనిపించినా వికెట్లు మాత్రం తీయలేకపోయారు.