IND vs NZ, 3rd ODI- 1st Innings Highlights:


హోల్కర్‌ స్టేడియం హోరెత్తింది. ఇండోర్‌ నగరం దద్దరిల్లింది. స్టాండ్స్‌లోని ప్రేక్షకులు సిక్సర్ల వర్షంలో తడిసి ముద్దయ్యారు. బౌండరీల వరదకు థ్రిల్లయ్యారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (101; 85 బంతుల్లో 9x4, 6x6), శుభ్‌మన్‌ గిల్‌ (112; 78 బంతుల్లో 13x4, 5x6) సెంచరీలు బాదడంతో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసింది. మూడో వన్డేలో న్యూజిలాండ్‌ ముందు 386 పరుగుల టార్గెట్‌ ఉంచింది. ఆఖర్లో  హార్దిక్‌ పాండ్య (54; 38 బంతుల్లో 3x4, 3x6), శార్దూల్‌ ఠాకూర్‌ (25; 17 బంతుల్లో 3x4, 1x6) దంచికొట్టారు.


ఓపెనర్లు కుమ్మేశారు!


అసలే హోల్కర్‌ స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామం! బౌండరీ సైజులూ చిన్నవే! ఇంకేం పరుగుల సునామీ ఖాయమే అనుకున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. రెండో ఓవర్‌ నుంచే రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ బాదుడు షురూ చేశారు. ఒక ఓవర్లో హిట్‌మ్యాన్‌ కొడితే మరో ఓవర్లో గిల్‌ బౌండరీలు దంచడంతో 7.3 ఓవర్లకే స్కోరు 50 చేరుకుంది. ఓపెనర్లిద్దరూ అదే జోరు కొనసాగించడంతో పది ఓవర్లకే టీమ్‌ఇండియా 82/0తో నిలిచింది.


పోటీపడి బాదేశారు!


ఒక ఎండ్‌ నుంచి హిట్‌మ్యాన్‌ కళ్లుచెదిరే సిక్సర్లు.. మరో ఎండ్‌ నుంచి గిల్‌ అందమైన బౌండరీలు కొట్టడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో గిల్‌ 33 బంతుల్లో, రోహిత్‌ 41 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు సాధించారు. దాంతో డ్రింక్స్‌ బ్రేక్‌కు టీమ్‌ఇండియా 147 పరుగులతో నిలిచింది. రోహిత్‌ మరింత దూకుడగా ఆడుతూ 83 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. అతడికిది వన్డేల్లో రెండో వేగవంతమైన శతకం కావడం ప్రత్యేకం. పైగా కివీస్‌పై రెండోది. తొలి వన్డేలో డబుల్‌ సెంచరీతో ఊపుమీదున్న గిల్‌ సైతం 72 బంతుల్లోనే శతకబాదేశాడు. అయితే సెంచరీ చేసిన వెంటనే 26.1వ బంతికి రోహిత్‌ను బ్రాస్‌వెల్‌ ఔట్‌ చేశాడు. మరికాసేపటికే సిక్సర్లు బాదుతున్న గిల్‌ను టిక్నర్‌ పెవిలియన్‌ పంపించాడు.


ఆఖర్లో పాండ్య, శార్దూల్‌ మెరుపులు


ఓపెనర్లు ఇద్దరూ ఔటయ్యాక టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. జట్టు స్కోరు 268 వద్ద ఇషాన్‌ కిషన్‌ (17) రనౌట్‌ అయ్యాడు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన విరాట్‌ కోహ్లీ (36)ను డఫి ఔట్‌ చేశాడు. సూర్యకుమార్‌ (14)నూ అతడే పెవిలియన్‌ పంపించాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (9) నిలవలేదు. ఈ సిచ్యువేషన్లో వైస్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య నిలబడ్డాడు. శార్దూల్‌ ఠాకూర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 34 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్న అతడిని 48.4వ బంతికి డఫి పెవిలియన్‌ పంపించాడు. అంతకు ముందే భారీ షాట్లు ఆడుతున్న శార్దూల్‌ సైతం ఔటవ్వడంతో టీమ్‌ఇండియా 385/9తో ఇన్నింగ్స్‌ ముగించింది.