IND vs NZ 2nd ODI:  న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ లో సమష్ఠిగా రాణించిన భారత్ కివీస్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బౌలర్లు  108 పరుగులకే కివీస్ ను ఆలౌట్ చేయగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (51) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో 3 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది.


రోహిత్ హాఫ్ సెంచరీ


108 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా రోహిత్ (51) స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించాడు. ఫోర్లు, సిక్సులు కొడుతూ 49 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ఆ వెంటనే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్ కు తోడైన కోహ్లీ (11) రెండు చూడచక్కని బౌండరీలు కొట్టాడు. అయితే ఆ తర్వాత స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. మరోవైపు గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ (53 బంతుల్లో 40).. ఇషాన్ కిషన్ (8) తో కలిసి భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు.


బౌలర్ల విజృంభణ


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లను టీమిండియా బౌలర్లు వణికించారు. బౌలర్లందరూ నువ్వా నేనా అన్నట్లు పోటీపడి వికెట్లు తీశారు. బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్ వికెట్ దక్కించుకున్నాడు. బౌలర్ల విజృంభణతో కివీస్ 15 ఓవర్లలోనే 5 ప్రధాన వికెట్లు కోల్పోయింది. మొదటి ఓవర్లోనే స్కోరు బోర్డుపై ఒక్క పరుగైనా చేరకుండానే ఫిన్ అలెన్ (0) ను బౌల్డ్ చేసిన మహ్మద్ షమీ వికెట్ల వేటను మొదలుపెట్టాడు. ఆ తర్వాత హెన్రీ నికోల్స్ (20 బంతుల్లో 2) ను సిరాజ్ ఔట్ చేశాడు. డారిల్ మిచెల్ (1) ను షమీ, డెవాన్ కాన్వే (7) ను పాండ్య ఔట్ చేశారు. అనంతరం 11వ ఓవర్లో కెప్టెన్ టామ్ లాథమ్ (1) శార్దూల్ ఠాకూర్ చేతికి చిక్కాడు. దీంతో న్యూజిలాండ్ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 


బ్రాస్ వెల్, ఫిలిప్స్ పోరాటం


తక్కువ స్కోరుకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన న్యూజిలాండ్ ను గత మ్యాచ్ లో సెంచరీ చేసిన మైఖెల్ బ్రాస్ వెల్ (22), గ్లెన్ ఫిలిప్స్ లు ఆదుకునే ప్రయత్నం చేశారు. అడపాదడపా బౌండరీలు కొడుతూ.. సింగిల్స్, డబుల్స్ తీస్తూ వీరు స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 41 పరుగులు జోడించారు. బలపడుతున్న వీరి భాగస్వామ్యాన్ని షమీ విడదీశాడు. ఒక చక్కని బంతితో కీపర్ క్యాచ్ ద్వారా ప్రమాదకర బ్రాస్ వెల్ ను పెవిలియన్ చేర్చాడు. అయితే ఫిలిప్స్ (36), శాంట్నర్ (27) తో కలిసి మళ్లీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ జంట ఏడో వికెట్ కు 47 పరుగులు జోడించింది. మిచెల్ శాంట్నర్ ను హార్దిక్ పాండ్య బౌల్డ్ చేయటంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ఫిలిప్స్ ను వాషింగ్టన్ సుందర్ బుట్టలో వేశాడు. అనంతరం న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతోసేపు పట్టలేదు.