IND vs NZ 2nd ODI: న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ ను టీమిండియా ఫాస్ట్ బౌలర్లు వణికించారు. షమీ 2, సిరాజ్, శార్దూల్, హార్దిక్ తలా ఒక వికెట్ తీసుకోవటంతో కివీస్ 15 ఓవర్లలోనే 5 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో 33 పరుగులు చేసింది. మైఖెల్ బ్రాస్ వెల్ (5), గ్లెన్ ఫిలిప్స్ (12) క్రీజులో ఉన్నారు. 


మొదటి ఓవర్లోనే స్కోరు బోర్డుపై ఒక్క పరుగైనా చేరకుండానే ఫిన్ అలెన్ (0) ను బౌల్డ్ చేసిన మహ్మద్ షమీ వికెట్ల వేటను మొదలుపెట్టాడు. ఆ తర్వాత హెన్రీ నికోల్స్ (20 బంతుల్లో 2) ను సిరాజ్ ఔట్ చేశాడు. డారిల్ మిచెల్ (1) ను షమీ, డెవాన్ కాన్వే (7) ను పాండ్య ఔట్ చేశారు. అనంతరం 11వ ఓవర్లో కెప్టెన్ టామ్ లాథమ్ (1) శార్దూల్ ఠాకూర్ చేతికి చిక్కాడు. దీంతో న్యూజిలాండ్ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 


టాస్ గెలిచిన భారత్


న్యూజిలాండ్ తో జరగనున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. రాయ్ పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మొదటి వన్డేలో ఆడిన జట్టుతోనే భారత్ ఈ మ్యాచులో బరిలోకి దిగుతోంది. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. 


'టాస్ నిర్ణయం గురించి జట్టుతో చాలా చర్చించాను. క్లిష్ట పరిస్థితుల్లో ఆడడం సవాల్ గా చేసుకోవాలనుకుంటున్నాం. అందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాం. ఇది మాకు పరీక్ష. వికెట్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని మాకు తెలుసు. గత మ్యాచ్ లో బ్రాస్ వెల్ బాగా బ్యాటింగ్ చేశాడు. అయితే చివరకి మేం గెలిచాం. ప్రాక్టీస్ సెషన్ లో కొంచెం మంచు కురిసింది. అయితే అది అంత ప్రభావం చూపదని క్యురేటర్ చెప్పారు. మేం హైదరాబాద్ లో మొదట బ్యాటింగ్ చేశాం. ఇక్కడు ముందు బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. మా జట్టులో ఎలాంటి మార్పులు లేవు.' అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 


'ఇక్కడ ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. కాబట్టి వికెట్ ఎలా ఉంటుందో కచ్చితంగా తెలియదు. అయితే టాస్ గెలిస్తే మేం కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లం. చివరి గేమ్ లో మా బ్యాటింగ్ బాగుంది. ఇక్కడా అదే కొనసాగించాలనుకుంటున్నాం. మాకు మ్యాచ్ లు గెలవడం ముఖ్యం. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆడితే అనుభవం వస్తుంది. ఇష్ సోధి ఇంకా కోలుకోలేదు. కాబట్టి మేం గత మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. ' అని కివీస్ కెప్టెన్ టామ్ లేథమ్ అన్నాడు.