IND vs NZ 2nd ODI:  టీమిండియా మరో వన్డే సిరీస్ విజయం ముంగిట నిలిచింది. శ్రీలంకను క్లీన్ స్వీప్ చేసిన భారత్ ఇప్పుడు కివీస్ తో సిరీస్ గెలుచుకునేందుకు ఒక అడుగు దూరంలో ఉంది. మొదటి వన్డేలో ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ ను ఓడించిన భారత్.. నేడు రెండో వన్డేలోనూ గెలిచి ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ దక్కించుకోవాలని చూస్తోంది. అయితే అదంత తేలిక మాత్రం కాదు. మొదటి మ్యాచ్ లో భారీ స్కోరు సాధించినా.. కేవలం 12 పరుగుల తేడాతో మాత్రమే విజయం సాధించింది. కాబట్టి రెండో వన్డేలో గెలవాలంటే భారత్ మరింత కసిగా ఆడాల్సిన అవసరం ఉంది. 


గిల్ ఒక్కడే


మొదటి వన్డేలో ఓపెనర్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో భారత్ భారీ స్కోరు సాధించింది. అయితే గిల్ తప్ప మిగతా బ్యాటర్లు తమ బ్యాట్లకు పని చెప్పలేదు. రోహిత్ (34), సూర్యకుమార్ (31), హార్దిక్ పాండ్య (28) మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. మరోవైపు శ్రీలంకపై విజృంభించిన విరాట్ కోహ్లీ (8) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. రాహుల్ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ ఆకట్టుకోలేకపోయాడు. రెండో వన్డేలో గెలవాలంటే మాత్రం బ్యాటర్లందరూ సమష్టిగా రాణించాల్సిందే. 349 స్కోరుకు కూడా కివీస్ దగ్గరగా వచ్చింది. కాబట్టి రెండో మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించి భారీ స్కోరు సాధించాల్సిందే. లేదంటే న్యూజిలాండ్ ను ఓడించడం కష్టమే


పట్టు వదలకూడదు


భారీ లక్ష్య ఛేదనలో కివీస్ బ్యాటర్లను టీమిండియా బౌలర్లు మొదట కట్టిపడేశారు. 110 పరుగులకే 5 వికెట్లు పడగొట్టారు. ఇంకేముంది విజయం నల్లేరు మీద నడకే అనిపించింది. అయితే ఇద్దరు కివీస్ బ్యాటర్లను కట్టడి చేయలేక మ్యాచ్ ను చివరి వరకు తీసుకొచ్చారు. మైఖెల్ బ్రాస్ వెల్ (78 బంతుల్లో 140), శాంట్నర్ (45 బంతుల్లో 57) మ్యాచ్ ను గెలిపించినంత పనిచేశారు. ఆఖర్లో సిరాజ్ రెండు వరుస వికెట్లు తీయబట్టి భారత్ ఊపిరి పీల్చుకుంది. కాబట్టి బౌలర్లు మధ్యలో పట్టువిడవకూడదు. ఇన్నింగ్స్ ఆసాంతం అదే తీవ్రతను చూపించాలి. 


న్యూజిలాండ్ తక్కువ కాదు


350 పరుగుల లక్ష్య ఛేదనలో 110 పరుగులకే సగం మంది బ్యాటర్లు పెవిలియన్ చేరినప్పటికీ మైఖెల్ బ్రాస్ వెల్, శాంట్నర్ ల పోరాటంతో గెలుపు అంచుల వరకు వచ్చింది న్యూజిలాండ్. ముఖ్యంగా బ్రాస్ వెల్ భారత్ కు చెమటలు పట్టించాడు. వారిద్దరితో పాటు మరో బ్యాటర్ నిలిచినా.. లేక స్కోరు ఇంకొంచెం తక్కువైనా కివీస్ గెలిచేదే. కాబట్టి న్యూజిలాండ్ తో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అస్సలు ఆ జట్టును తేలికగా తీసుకోకూడదు. తొలి మ్యాచ్ లో గెలుపు ముంగిట బోల్తా పడ్డ ఆ జట్టు.. రెండో వన్డేలో మరింత పట్టుదలగా ఆడుతుందనడంలో సందేహం లేదు. కాబట్టి టీమిండియా అలసత్వానికి అవకాశం ఇవ్వకూడదు. 


పిచ్ పరిస్థితి


రాయ్ పూర్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్ది స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ కే మొగ్గు చూపే అవకాశం ఉంది. 


ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు


ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. డీడీ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. 


భారత్ తుది జట్టు (అంచనా)


రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ. 


న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా) 


ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.