IND Vs NZ 1st Test 4th Day: బెంగళూరు: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ శతకం బాదేశాడు. కేవలం 110 బంతుల్లో సర్ఫరాజ్ ఖాన్ టెస్టు సెంచరీ చేశాడు. కాగా, టెస్టుల్లో సర్ఫరాజ్ ఖాన్ కు ఇది తొలి శతకం. అంతర్జాతీయ క్రికెట్ లోనూ సర్ఫరాజ్ కు ఇది మొదటి సెంచరీ. అది కూడా జట్టు తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప స్కోరుకు ఆలౌట్ కాగా, కష్టాల్లో ఉన్న సమయంలో రెండో ఇన్నింగ్స్ లో అద్భుత శతకం చేశాడు సర్ఫరాజ్. సౌతీ బౌలింగ్ లో ఇన్నింగ్స్ 57వ ఓవర్లో మూడో బంతిని బౌండరీకి తరలించడంతో టెస్టుల్లో సర్ఫరాజ్ తొలి సెంచరీ పూర్తయింది. 60 ఓవర్లలో భారత్ 281/3తో ఉంది. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేయగా, పంత్ 12 పరుగులతో ఆడుతున్నాడు.


 






రెండో ఇన్నింగ్స్‌లో రాణించిన భారత బ్యాటర్లు


న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్ షాక్ నుంచి భారత్ కోలుకుంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 46 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ జట్టుకు 356 పరుగుల ఆధిక్యం లభించింది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. కానీ దురదృష్టవశాత్తూ మూడో రోజు ఆట లాస్ట్ బాల్ కు విరాట్ కోహ్లీ (70 పరుగులు: 102 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) ఔటయ్యాడు. వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ ఔట్ కావడంతో భారత్ బిగ్ వికెట్ కోల్పోయింది. 


నాలుగో రోజు సర్ఫరాజ్ ఖాన్ (70 బ్యాటింగ్: 78 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు), రిషబ్ పంత్ బ్యాటింగ్ కు వచ్చారు. రూర్కీ బౌలింగ్ లో సర్ఫరాజ్ ఒకే ఓవర్లో రెండ బౌండరీలు బాది ఎదురుడాదికి దిగాడు. హెన్రీని సైతం సర్ఫరాజ్ టార్గెట్ చేసి వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో టీమ్ సౌతీ బౌలింగ్ లో బంతిని బౌండరీకి తరలించడం ద్వారా సర్ఫరాజ్ ఖాన్ కెరీర్ లో తొలి అంతర్జాతీయ శతకం సాధించాడు. రిషబ్ పంత్ సైతం ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డు వేగం తగ్గకుండా చూస్తున్నాడు.