IND Vs NZ 1st Test 3rd Day: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు కోలుకుంది. మూడో రోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. నిజానికి ఈరోజు ఆటను భారత్ ఫుల్ డామినేషన్‌తో ముగించేది. కానీ దురదృష్టవశాత్తూ ఆట చివరి బంతికి విరాట్ కోహ్లీ (70: 102 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ (70 బ్యాటింగ్: 78 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) క్రీజులో ఉన్నాడు.


ఇది భారత బ్యాటింగ్ లైనప్‌పై ప్రభావం చూపే అంశమే. అంతకు ముందు న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో వారికి 356 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఈ ఒక్కరోజులోనే ఏకంగా 453 పరుగులు రావడం విశేషం. భారత్‌లో ఒకే రోజు టెస్టు మ్యాచ్‌ల్లో వచ్చిన పరుగుల్లో ఇవి రెండో అత్యధికం. 2009లో భారత్, శ్రీలంకల మధ్య బ్రబౌర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో ఒకే రోజు 470 పరుగులు వచ్చాయి. ప్రస్తుతానికి ఇది రికార్డుగా ఉంది.


రచ్చ చేసిన రచిన్ రవీంద్ర, టిమ్ సౌతీ...
ఓవర్ నైట్ స్కోరు 180/3తో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఆట ప్రారంభమైన ఐదు ఓవర్లలోపే డేరిల్ మిచెల్‌ను (18: 49 బంతుల్లో, రెండు ఫోర్లు) సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత టామ్ బ్లండెల్‌ను (5: 8 బంతుల్లో, ఒక ఫోర్) బుమ్రా, గ్లెన్ ఫిలిప్స్ (14: 18 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), మాట్ హెన్రీలను (8: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) రవీంద్ర జడేజా పెవిలియన్ బాట పట్టించారు. దీంతో మొదటి 15 ఓవర్లలోనే న్యూజిలాండ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. 233/7తో నిలిచి తక్కువ ఆధిక్యానికి పరిమితం అవుతుందా? అన్న స్థాయిలో నిలిచింది.


కానీ రచిన్ రవీంద్ర (134: 157 బంతుల్లో, 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లు), టిమ్ సౌతీలు (65: 73 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) రాసిన స్క్రిప్టు వేరే. వీరిద్దరూ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఏకంగా 6.27 రన్‌రేట్‌తో భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. టీ బ్రేక్‌కు ముందు చివరి నాలుగు ఓవర్లు అయితే పక్కా టీ20 స్టఫ్. కేవలం 24 బంతుల్లోనే వీరిద్దరూ 58 పరుగులు బాదేశారు. ఈ నాలుగు అశ్విన్ బౌలింగ్‌లో బౌండరీతో రచిన్ రవీంద్ర సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ బ్రేక్ నుంచి వచ్చాక మూడు ఓవర్లలోనే బుమ్రా బౌలింగ్‌లో సింగిల్ తీసి టిమ్ సౌతీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేశాక ఈ జోడీని మహ్మద్ సిరాజ్ విడదీశాడు. తన బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన టిమ్ సౌతీ తర్వాతి బంతికే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రవీంద్ర జడేజా చేతికి చిక్కాడు. తర్వాత మిగిలిన మూడు వికెట్లు గబగబా పడిపోయాయి.


దీంతో న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 356 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.



మంచి స్టార్ట్ ఇచ్చిన ఓపెనర్లు
భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (35: 52 బంతుల్లో, ఆరు ఫోర్లు), రోహిత్ శర్మ (52: 63 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి వికెట్‌కు 17.1 ఓవర్లలోనే 72 పరుగులు జోడించారు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ స్టంపౌట్ అయి వెనుదిరిగాడు. అనంతరం హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కెప్టెన్ రోహిత్ శర్మను కూడా అజాజ్ పటేలే అవుట్ చేశాడు. భారత్ కొద్దిగా కష్టాల్లోకి వెళ్తుందనుకుంటున్న తరుణంలో వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ ఇన్నింగ్స్‌ను మళ్లీ లైన్‌లో పెట్టారు.


ముఖ్యంగా సర్పరాజ్ ఖాన్ మొదటి బంతి నుంచే వేగంగా ఆడటం ప్రారంభించాడు. మరో పక్క కోహ్లీ కాస్త ప్రారంభంలో నెమ్మదిగా ఆడినా తర్వాత వేగం పుంజుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ 40 బంతుల్లో, విరాట్ కోహ్లీ 70 బంతుల్లో తమ అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అంతా చక్కగా సాగిపోతుంది అనుకున్న టైమ్‌లో సరిగ్గా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో భారత్ మూడు వికెట్ల నష్టానికి 231 పరుగుల స్కోరుతో మూడో రోజును ముగించింది. ఇంకా 125 పరుగులు వెనకబడి ఉంది.


Also Read: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్