IND vs NZ, 1st ODI: భారత్- న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో కివీస్ ముందు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. స్కోరు బోర్డుపై ఈ పరుగులు చూసి అభిమానులు భారత్ దే విజయం అని నిర్ణయించుకున్నారు. ఆటగాళ్లు ధీమాతోనే కనిపించారు. అందుకు తగ్గట్లే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మొదలైంది. భారత బౌలర్ల ధాటికి 110 పరుగులకే సగం జట్టు పెవిలియన్ చేరింది. డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ లాంటి భీకర ఆటగాళ్లు ఔటైపోయారు. ఈ దశలో భారత్ విజయం నల్లేరుపై నడకే అనిపించింది. అయితే ఒకే ఒక్కడు టీమిండియా అభిమానులతో పాటు ఆటగాళ్లకు ఇంత చలిలోనూ చెమటలు పట్టించాడు. వీరోచిత బ్యాటింగ్ తో తన జట్టును గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సులు బాదుతూ కేవలం 78 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. అతనే మైఖెల్ బ్రాస్ వెల్. ఈ మ్యాచ్ లో విజయం భారత్ దే అయినప్పటికీ.. న్యూజిలాండ్ ఆటగాడు బ్రాస్ వెల్ తన పోరాటంతో అందరి మనసులను గెలుచుకున్నాడు.
హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్ అద్భుత డబుల్ సెంచరీతో భారత్ భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లతో చెలరేగటంతో టీమిండియా విజయం సాధించింది. ఆ జట్టు బ్యాటర్ మైఖెల్ బ్రాస్ వెల్ (140) వీరోచిత శతకంతో జట్టును గెలిపించడానికి విఫలయత్నం చేశాడు.
గిల్ డబుల్ సెంచరీ- భారత్ భారీస్కోరు
టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ (34), శుభ్ మన్ గిల్ లు తొలి వికెట్ కు 60 పరుగులు జోడించి శుభారంభం అందించారు. రోహిత్ నిదానంగా ఆడగా.. గిల్ కళాత్మక షాట్లతో అలరించాడు. తన సహజ శైలికి విరుద్ధంగా నిదానంగా ఆడిన కెప్టెన్ రోహిత్ 38 బంతుల్లో 34 పరుగులు చేసి టిక్నర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ తన ఫాంను కొనసాగించలేకపోయాడు. 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. నాలుగో స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ (14 బంతుల్లో 5) కూడా ఎక్కువసేపు నిలవలేదు. దీంతో భారత్ 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.
శుభ్ మన్ గిల్ కళాత్మక విధ్వంసం
ఈ మ్యాచ్ లో ఆటంతా గిల్ దే. మొదట్నుంచి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ప్రారంభించిన గిల్.. ఇన్నింగ్స్ ఆసాంతం అదే ఊపును కొనసాగించాడు. కళాత్మక విధ్వంసం సృష్టించిన గిల్ కెరీర్ లో తొలి డబుల్ సెంచరీని అందుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ కళాత్మక షాట్లు కొడుతూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. చూస్తుండగానే అర్ధశతకం, శతకం పూర్తిచేసుకున్నాడు. సెంచరీ తర్వాత దూకుడు పెంచిన గిల్ మైదానం నలువైపులా చూడచక్కని షాట్లు కొట్టాడు. ఈ క్రమంలోనే కేవలం 146 బంతుల్లో ద్విశతకం సాధించాడు. ఇది గిల్ కు మెయిడెన్ డబుల్ సెంచరీ. అతనికి సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్య (28) సహకరించారు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ లు రెండేసి వికెట్లు తీసుకున్నారు.
కివీస్ టపాటపా
భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడ్డారు. 28 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన కివీస్ ఆ తర్వాత వరుసగా వికెట్లు చేజార్చుకుంది. 110 పరుగులకే 5 వికెట్లు నష్టపోయింది. ఈ దశలో ఆ జట్టు ఆటగాడు మైఖెల్ బ్రాస్ వెల్ వీరోచిత శతకంతో తన జట్టును గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లతో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ లు 2 వికెట్లు తీసుకున్నారు.