IND vs NZ, 1st ODI: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. భారత యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (34), హార్దిక్ పాండ్య (28), సూర్యకుమార్ యాదవ్ (31) పరుగులతో రాణించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదట ఆచితూచి ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ మరోసారి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 60 పరుగులు జోడించారు. తన సహజ శైలికి విరుద్ధంగా నిదానంగా ఆడిన కెప్టెన్ రోహిత్ 38 బంతుల్లో 34 పరుగులు చేసి టిక్నర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ తన ఫాంను కొనసాగించలేకపోయాడు. 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. నాలుగో స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ (14 బంతుల్లో 5) కూడా ఎక్కువసేపు నిలవలేదు. దీంతో భారత్ 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.
గిల్ కళాత్మక విధ్వంసం
అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఓపెనర్ శుభ్ మన్ గిల్ తన అద్భుత ఫాంను కొనసాగిస్తూ డబుల్ సెంచరీ సాధించాడు. కళాత్మక షాట్లు కొడుతూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. చూస్తుండగానే అర్ధశతకం, శతకం పూర్తిచేసుకున్నాడు. సెంచరీ తర్వాత దూకుడు పెంచిన గిల్ మైదానం నలువైపులా చూడచక్కని షాట్లు కొట్టాడు. ఈ క్రమంలోనే కేవలం 146 బంతుల్లో ద్విశతకం సాధించాడు. ఇది గిల్ కు మెయిడెన్ డబుల్ సెంచరీ. అతనికి సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్య (28) సహకరించారు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ లు రెండేసి వికెట్లు తీసుకున్నారు.
గిల్ ద్విశతకంతో భారత్ భారీస్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది.