IND vs NZ 1st ODI: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆచితూచి ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ మరోసారి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 60 పరుగులు జోడించారు. తన సహజ శైలికి విరుద్ధంగా నిదానంగా ఆడిన కెప్టెన్ రోహిత్ 38 బంతుల్లో 34 పరుగులు చేసి టిక్నర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ తన ఫాంను కొనసాగించలేకపోయాడు. 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. నాలుగో స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ (14 బంతుల్లో 5) కూడా ఎక్కువసేపు నిలవలేదు. దీంతో భారత్ 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.
గిల్ అర్ధశతకం
అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఓపెనర్ శుభ్ మన్ గిల్ తన అద్భుత ఫాంను కొనసాగిస్తూ అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. కళాత్మక షాట్లు కొడుతూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. అతనికి సూర్యకుమార్ యాదవ్ తన మెరుపు బ్యాటింగ్ తో సహకరిస్తున్నాడు. దీంతో 25 ఓవర్లు ముగిసేసరికి 3 వికట్లు కోల్పోయిన భారత్ 154 పరుగులు చేసింది. గిల్, సూర్యలు నాలుగో వికెట్ కు ఇప్పటివరకు 32 బంతుల్లోనే 43 పరుగులు జోడించారు. ప్రస్తుతం గిల్ 78, సూర్య 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచిన భారత్
భారత్- న్యూజిలాండ్ మధ్య హైదరాబాద్ వేదికగా జరుగనున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. మంచి పిచ్, కొద్దిగా పొడిగా కనిపిస్తోంది. మేము ఫ్లడ్ లైట్ల కింద బౌలింగ్ చేయాలనుకుంటున్నాము. అలాగే స్కోరును డిఫెండ్ చేయగలమని భావిస్తున్నాం. మేం శ్రీలంకపై బాగా ఆడాం. ఆ విజయ పరంపరను కొనసాగించడం ముఖ్యం. అయితే ఇది భిన్నమైన సవాల్. హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్ లు జట్టులోకి తిరిగి వచ్చారు. అలాగే సూర్యకుమార్, ఇషాన్ లు ఆడుతున్నారు.' అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
'మా జట్టులో ఆటగాళ్లు చాలా మంచి మ్యాచ్ లు ఆడారు. మేం ఈరోజు ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం.' అని కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ అన్నాడు.