IND vs NZ 1st ODI: భారత్- న్యూజిలాండ్ మధ్య హైదరాబాద్ వేదికగా జరుగనున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 


'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. మంచి పిచ్, కొద్దిగా పొడిగా కనిపిస్తోంది. మేము ఫ్లడ్ లైట్ల కింద బౌలింగ్ చేయాలనుకుంటున్నాము. అలాగే స్కోరును డిఫెండ్ చేయగలమని భావిస్తున్నాం. మేం శ్రీలంకపై బాగా ఆడాం. ఆ విజయ పరంపరను కొనసాగించడం ముఖ్యం.  అయితే ఇది భిన్నమైన సవాల్. హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్ లు జట్టులోకి తిరిగి వచ్చారు. అలాగే సూర్యకుమార్, ఇషాన్ లు ఆడుతున్నారు.' అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 


'మా జట్టులో ఆటగాళ్లు చాలా మంచి మ్యాచ్ లు ఆడారు. మేం ఈరోజు ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం.' అని కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ అన్నాడు. 


కివీస్ పై భారత్ దే పైచేయి


వన్డేల్లో న్యూజిలాండ్‌పై భారత్ కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 113 మ్యాచ్‌లు జరిగ్గా.. 55 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. 50 మ్యాచ్‌ల్లో కివీస్‌ విజయం సాధించింది. 


జోరు మీద భారత్


లంకపై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఆనందంలో ఉంది టీమిండియా. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ లో టాపార్డర్ రోహిత్, గిల్, కోహ్లీలు సూపర్ ఫాంలో ఉన్నారు. శ్రేయస్, పాండ్య, అక్షర్ పటేల్ లు చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేస్తున్నారు. ఇక బౌలింగ్ లో సిరాజ్ తన కెరీర్ లోనే అద్భుత ఫాంలో ఉన్నాడు. పైగా రేపు తన స్వస్థలం హైదరాబాద్ లో మ్యాచ్. ఇక అతనికి షమీ, ఉమ్రాన్ మాలిక్ ల నుంచి సరైన సహకారం అందుతోంది. ప్రధాన స్పిన్నర్ గా కుల్దీప్ నే తుది జట్టులోకి తీసుకోవచ్చు. అతను కూడా లంకపై మంచి ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ బదులు వాషింగ్టన్ సుందర్ ఆడనున్నాడు. రేపు జరిగే మ్యాచ్ లోనూ ఇలాగే ఆల్ రౌండ్ ప్రదర్శన చేస్తే విజయం కష్టమేమీ కాదు. 


టీమిండియా తుది జట్టు


రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.


న్యూజిలాండ్ తుది జట్టు


ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.