IND vs NZ 1st ODI:  భారత్- న్యూజిలాండ్ సిరీస్ కు సమయం ఆసన్నమైంది. ఓవైపు శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ గెలిచి జోరుమీదున్న టీమిండియా జట్టు.. మరోవైపు పాకిస్థాన్ పై వన్డే సిరీస్ ను గెలుచుకుని ఉత్సాహంతో ఉన్నన్యూజిలాండ్ టీం. రేపు ఈ రెండింటి మధ్య హైదరాబాద్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. బలాబలాల పరంగా సమంగా ఉన్నప్పటికీ.. గత రికార్డులు భారత్ కే అనుకూలంగా ఉన్నాయి. వన్డేల్లో, టీ20ల్లోనూ కివీస్ పై టీమిండియాదే పైచేయి. మరి రేపు తొలి మ్యాచ్ గెలిచి సిరీస్ లో బోణీ ఎవరు చేస్తారో చూద్దాం. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 


జోరు మీద భారత్


లంకపై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఆనందంలో ఉంది టీమిండియా. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ లో టాపార్డర్ రోహిత్, గిల్, కోహ్లీలు సూపర్ ఫాంలో ఉన్నారు. శ్రేయస్, పాండ్య, అక్షర్ పటేల్ లు చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేస్తున్నారు. ఇక బౌలింగ్ లో సిరాజ్ తన కెరీర్ లోనే అద్భుత ఫాంలో ఉన్నాడు. పైగా రేపు తన స్వస్థలం హైదరాబాద్ లో మ్యాచ్. ఇక అతనికి షమీ, ఉమ్రాన్ మాలిక్ ల నుంచి సరైన సహకారం అందుతోంది. ప్రధాన స్పిన్నర్ గా కుల్దీప్ నే తుది జట్టులోకి తీసుకోవచ్చు. అతను కూడా లంకపై మంచి ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ బదులు వాషింగ్టన్ సుందర్ ఆడనున్నాడు. రేపు జరిగే మ్యాచ్ లోనూ ఇలాగే ఆల్ రౌండ్ ప్రదర్శన చేస్తే విజయం కష్టమేమీ కాదు. 


ఉత్సాహంతో న్యూజిలాండ్


పాకిస్థాన్ తో జరిగిన వన్డే సిరీస్ ను 2-1తో గెలుచుకున్న న్యూజిలాండ్ జట్టు ఉత్సాహంతో ఉంది. టామ్ లాథమ్, ఫిన్ అలెన్, బ్రాస్ వెల్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్ లాంటి బ్యాటర్లు వారికున్నారు. ముఖ్యంగా కెప్టెన్ లాథమ్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.  అలాగే బౌలింగ్ లో లాకీ ఫెర్గూసన్, మిచెల్ శాంట్నర్, బ్లెయిర్ టిక్నర్ లాంటి వాళ్లతో టీమిండియాకు సవాల్ తప్పదు.  ఈ సిరీస్ కు న్యూజిలాండ్ తన ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలు భారత్ తో వన్డే, టీ20 సిరీస్ లు ఆడడంలేదు. 


కివీస్ పై భారత్ దే పైచేయి


వన్డేల్లో న్యూజిలాండ్‌పై భారత్ కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 113 మ్యాచ్‌లు జరిగ్గా.. 55 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. 50 మ్యాచ్‌ల్లో కివీస్‌ విజయం సాధించింది. 


పిచ్ పరిస్థితి


హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కు వర్షం ముప్పు లేదు. బ్యాటింగ్, బౌలింగ్ కు రెండింటికీ సమానంగా సహకరిస్తుంది. 


వన్డేలకు భారత జట్టు: 


రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎస్ భరత్, రజత్‌ పాటిదార్‌, వాషింగ్టన్‌ సుందర్, షాబాజ్‌ అహ్మద్‌,శార్దూల్ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్‌,మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌,ఉమ్రాన్‌ మాలిక్.


న్యూజిలాండ్ జట్టు


టామ్ లాథమ్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, డగ్ బ్రేస్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, హెన్రీ సో షిప్లెన్, బ్లెయిర్ టిక్నర్.