IND vs BAN: గాయాల బెడద..... ప్రస్తుతం టీమిండియాను ఆట పరంగానే కాక వేధిస్తున్న మరో సమస్య గాయాలు. అవును జట్టులో చాలామంది ఆటగాళ్లు తరచుగా గాయపడుతున్నారు. ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలు పక్కన పెడితో ఈ గాయాలు జట్టు ఆటతీరును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అలానే విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి. 


బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేనే తీసుకుంటే ఈ ఒక్క మ్యాచులోనే ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. కెప్టెన్ రోహిత్ శర్మకు ఎడమ చేతి వేలికి గాయమైతే... ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ వెన్ను గాయంతో బాధపడ్డాడు. బ్యాటింగ్ లో రోహిత్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అలానే సీనియర్లు లేని ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో బాగా రాణిస్తున్న దీపక్ కూడా అంతే ముఖ్యం. అయితే ఆ మ్యాచులో వీరిరువురూ గాయపడ్డారు. ఈ మ్యాచులో చాహర్ 3 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కొత్త బంతితో ప్రభావవంతంగా కనిపించాడు. అయితే తర్వాత తను గాయంతో మైదానాన్ని వీడటంతో ఉన్న ఐదుగురు బౌలర్లతోనే బౌలింగ్ కోటా పూర్తి చేయాల్సి వచ్చింది. 69 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన బంగ్లా చివరకు 271 పరుగులు చేసింది. దీపక్ చాహర్ ఉండుంటే ఆ స్కోరు చేయగలిగేది కాదు అని చెప్పలేం కానీ.. కెప్టెన్ కు మరో బౌలింగ్ ఆప్షన్ ఉండుండేది. ఫాంలో ఉన్న చాహర్ బంగ్లా బ్యాటర్లను నిలువరించేవాడేమో. కానీ అలా జరగలేదు. ఇక భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. రోహిత్ గాయపడటంతో ఓపెనింగ్ కు వచ్చిన కోహ్లీ ఆకట్టుకోలేకపోయాడు. చివర్లో రోహిత్ ఆడినా అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. అయినా చేతివేలి గాయంతోనే రోహిత్ విజయం కోసం పోరాడాడు.  ఒకవేళ రోహిత్ కు గాయం కాకుండా ఉండుంటే గెలుపు సాధ్యమయ్యేదేమో. కాబట్టి, బంగ్లాతో రెండో వన్డేలో భారత్ ఓటమిలో గాయాలకు పాత్ర ఉంది. 


ఒకరా... ఇద్దరా


టీమిండియాకు గాయాలు కొత్త కాదు. ప్రతి సిరీస్ లోనూ ఎవరో ఒకరు గాయపడుతూనే ఉన్నారు. పని భారం అని చెప్పి ఈ మధ్య కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్నారు. ఒక్కో సిరీస్ కు ఒక్కో జట్టును బరిలోకి దించుతున్నారు. అయినప్పటికీ ఆటగాళ్లు గాయాలపాలవుతూనే ఉన్నారు. ఆసియా కప్ నుంచి ఇది మరీ ఎక్కువగా కనపడుతోంది. భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆ టోర్నీలో గాయపడ్డాడు. దాంతోపాటు టీ20 ప్రపంచకప్ నకు దూరమయ్యాడు. స్పిన్ ఆల్ రౌండర్ గా, బ్యాటర్ గా, చురుకైన ఫీల్డర్ గా జడేజా జట్టులో చాలా కీలకం. అలాగే టీమిండియా బౌలింగ్ లో ప్రధాన ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా గాయంతోనే ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ ఆడలేదు. బుమ్రా లేని మన బౌలింగ్ గాడి తప్పింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇక మరో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తరచుగా గాయపడుతూనే ఉంటాడు. ఇక వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను అర్ధంతరంగా బంగ్లా సిరీస్ నుంచి తప్పించారు. అతనికి ఏమైంది అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు.  ఇప్పుడు రోహిత్, చాహర్, కుల్దీప్ సేన్ లు గాయపడ్డారు. మొన్నటివరకు కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్ గాయాలపాలై కోలుకుని వచ్చారు. ఇలా దాదాపు ఇండియా టీం మొత్తం గాయాలంతో సహవాసం చేస్తోంది. 


ఫిట్ నెస్ ఎక్కడ?


ప్రస్తుతం భారత క్రికెట్ లో ఫిట్ గా ఉంది ఎవరు అంటే విరాట్ కోహ్లీ అనే సమాధానం వస్తోంది. అవును అలుపెరగని క్రికెట్ ఆడుతున్నా.. 34 ఏళ్ల వయసులోనే అథ్లెట్లను తలపించే ఫిట్ నెస్ తో ఉంటాడు కోహ్లీ. బ్యాటింగ్ లో అయినా, ఫీల్డింగ్ లో అయినా చిరుతలా కదులుతాడు. సంవత్సరాల నుంచి కష్టపడి తన ఫిట్ నెస్ ను కాపాడుకుంటున్నాడు. విరాట్ కెప్టెన్ గా ఉన్నప్పుడు జట్టులో అత్యున్నత ఫిట్ నెస్ ప్రమాణాలు నెలకొల్పాడు. అయితే రోహిత్ కెప్టెన్ అయ్యాక అలా లేదు. ప్రస్తుత జట్టులో ఎవరూ అంత ఫిట్ గా ఉన్నట్లు కనిపించడంలేదు. పరుగులు ఆపడంలోనూ, క్యాచులు పట్టడంలోనూ మన జట్టు ప్రదర్శన ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం భారత జట్టులో ఫిట్ నెస్ ప్రమాణాలు మునుపటిలా లేవన్నది మాత్రం సుస్పష్టం.


ఎన్ సీఏ, సపోర్ట్ స్టాఫ్ ఏం చేస్తున్నారు?


భారత జట్టులో ఎవరైనా ఆటగాడు గాయపడితే బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ సీఏ)కు వెళతారు. అక్కడ ఉండి కోలుకుంటాడు. తిరిగి ఫిట్ నెస్ సంపాదించుకుంటాడు. అయితే ఇప్పుడు ఎన్ సీఏ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారణం.... అక్కడకు వెళ్లి వచ్చినవారు కూడా మళ్లీ వెంటనే గాయాల బారిన పడడం. దీపక్ చాహర్ అక్కడకు వెళ్లి కోలుకుని వచ్చాడు. అయితే మళ్లీ బంగ్లాతో సిరీస్ లో గాయపడ్డాడు. అంతకుముందు బుమ్రా కూడా ఎన్ సీఏ నుంచి వచ్చాడు. అయితే మళ్లీ వెంటనే గాయపడ్డాడు. మరి ఎన్ సీఏ ఏం చేస్తున్నట్లు. ఒకసారి గాయపడి ఎన్ సీఏకు వెళ్తే మళ్లీ వారు ఫిట్ గా ఉన్నట్లు తేలిస్తేనే టీమిండియాకు ఆడతారు. అలాంటిది అక్కడ నుంచి వచ్చిన ఆటగాళ్లు వెంటనే గాయపడడం ప్రశ్నలకు తావిస్తోంది.


అలాగే జట్టులో ఆటగాళ్ల ఫిట్ నెస్, డైట్ లాంటి వ్యవహారాలు చూసుకోవడం... ఫిజయోలు, మసాజర్లు, సపోర్ట్ స్టాఫ్ పని. మరి వారంతా పనిచేస్తున్నప్పటికీ జట్టులో మెరుగైన ఫిట్ నెస్ మాత్రం కనిపించడంలేదు. 'ఈ ఆటగాళ్లలో చాలామంది క్రికెటర్లలా కాకుండా ఫుట్ బాల్ క్రీడాకారులు, బాస్కెట్ బాల్ ఆటగాళ్లలా శిక్షణ పొందుతున్నారు. మాకు క్రికెట్- నిర్దిష్ట శిక్షణ అవసరం. అయితే భారత్ లో అది జరగడంలేదు. అయితే దీనికి నేను అథ్లెట్లను నిందించను.' అని భారత జట్టు మాజీ ట్రైనర్ రామ్ జీ శ్రీనివాసన్ చెప్పారు. ఆయన వ్యాఖ్యలను బట్టి జట్టులో ఏం జరుగుతోందో తెలుస్తోంది. 


మొత్తంగా చూసుకుంటే భారత జట్టు ప్రదర్శన మైదానంలోనే కాదు బయట బాగాలేదు. అసలు బీసీసీఐకు, టీం మేనేజ్ మెంటుకు మధ్య సఖ్యత లేనట్లు సమాచారం. కొన్నివారాల క్రితం చేతన్ శర్మను చీఫ్ సెలెక్టరుగా తొలగించారు. ఫాంలోని పంత్ కు అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడసలు అతనికి ఏమైందో స్పష్టతలేదు. ఇదంతా టీం మేనేజ్ మెంట్, బీసీసీఐ మధ్య సఖ్యత లేదనడానికి నిదర్శనంగా కనిపిస్తోంది. 


ఏదేమైనా టీమిండియా ఆటతీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఫార్మాట్లతో సంబంధం లేకుండా ఆట పడిపోతోంది. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్ తో వన్డే సిరీస్, ఇప్పుడు బంగ్లాతో వన్డే సిరీస్ కోల్పోవడం అందుకు నిదర్శనం. ఇదిలాగే కొనసాగితే భారత్ మరో విండిస్ లా తయారవుతుందేమో అని క్రికెట్ అభిమానులు బాధపడుతున్నారు.