IND Vs BAN Test:  ఢాకా వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన జట్టును రవిచంద్రన్ అశ్విన్ (42 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (29 నాటౌట్)లు అద్భుతంగా ఆడి గెలిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాట్ తో రాణించిన అశ్విన్... జట్టు ఆధారపడదగ్గ ఆటగాడిగా మరోసారి నిరూపించాడు. తాజాగా ఆ మ్యాచ్ గురించి, బంగ్లా ఆటగాళ్లతో జరిగిన సంభాషణ గురించి అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ లో వివరించాడు. 


35 ఓవర్ల వరకు ఆగమని చెప్పాను


నాలుగో రోజు ఆటలో షకీబుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్ లు మొదటి గంటలోనే 3 వికెట్లు పడగొట్టి భారత్ పై ఒత్తిడి పెంచారు. అయితే అంతకు ముందు మూడో రోజు ఆట ముగిశాక బంగ్లా ఆటగాళ్లు మిరాజ్, లిటన్ దాస్ లతో జరిగిన సంభాషణ గురించి అశ్విన్ చెప్పాడు. 'మిరాజ్, లిటన్ లు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్నారు. అప్పుడే నేను అక్కడకు వెళ్లాను. వారు నన్ను ఆటపట్టిస్తారేమో అని అనుకున్నాను. అయితే వారు చాలా మంచివాళ్లు. 'వెల్కమ్ యాష్ భాయ్. ఈ రోజు నైట్ వాచ్ మన్ గా నువ్వే వస్తావని మేమనుకున్నాం. ఎందుకు రాలేదు? రేపు ఎలాగైనా నువ్వు బ్యాటింగ్ కు రావాలి కదా. నీ వికెట్ చాలా కీలకం' అంటూ అనడం మొదలు పెట్టారు. బంగ్లాదేశ్ కు చరిత్రాత్మకమైన టెస్ట్ విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు అని నేను అన్నాను. దానికి వారు బదులిస్తూ 'మీరు లోతుగా బ్యాటింగ్ చేస్తారని మాకు తెలుసు. నాలుగో రోజు మాకు చాలా కీలకం. అయితే మీర్పూర్ లో నాలుగో ఇన్నింగ్స్ లో ఏ లక్ష్యాన్ని ఛేదించడం అంత తేలిక కాదు' అని వారు నాతో అన్నారు. అప్పుడు నేను మిరాజ్ తో ఇలా అన్నాను. బ్రో 35 ఓవర్లు ముగిసే వరకు ఆగండి. ఒక్కసారి బంతి పరిస్థితి మారితే ఏదైనా జరగవచ్చు' అని అన్నాను. 


లిటన్ ఆ స్థాయికి చేరుకుంటాడని ఆశించాను


అలాగే లిటన్ దాస్ గురించి అశ్విన్ మాట్లాడాడు. అతను విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ స్థాయికి చేరుకుంటాడని తాను ఆశించినట్లు అశ్విన్ చెప్పాడు. 'నేను లిటన్ దాస్ ని అతని టెస్ట్ అరంగేట్రం సమయంలో చూశాను. అతని ఆటతీరు చూసి బంగ్లాదేశ్ క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లే ప్లేయర్ అవుతాడని ఆశించాను. అదే విషయం అతనితో చెప్పాను. 'నేను నిరాశకు గురయ్యాను. 'మీరు టెస్ట్ క్రికెట్ లో ప్రస్తుతమున్న అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరవుతారని నేననుకున్నాను' అని అతనితో అన్నాను. దానికి లిటన్ బదులిస్తూ.. 'అవును నేను అంగీకరిస్తున్నాను యాష్ భాయ్. అయితే మన క్రికెట్ సంస్కృతి వేరు. మేం ఇక్కడ మాత్రమే ఆడుతున్నాం కాబట్టి మాకు అంత ఎక్స్ పోజర్ రాదు. మేం వేరే పిచ్ లో ఆడినప్పుడు దానికి తగ్గట్లుగా మారడానికి సమయం పడుతుంది' అని లిటన్ అన్నాడు.