AUS vs SA 2nd Test:  మెల్ బోర్న్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. బాక్సింగ్ డే టెస్టులో సౌతాఫ్రికా పై ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 3 టెస్టుల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో కైవసం చేసుకుంది. 


ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ప్రొటీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ 5 వికెట్లతో సౌతాఫ్రికా బ్యాటింగ్ వెన్ను విరిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 189 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వెయిర్నే(52), మార్కో జాన్సన్ (59) అర్ధశతకాలతో రాణించటంతో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. 


డబుల్ సెంచరీతో చెలరేగిన వార్నర్


అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా.. డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీతో చెలరేగటంతో భారీ స్కోరు సాధించింది. వార్నర్ తో పాటు అలెక్స్ క్యారీ (111) స్టీవ్ స్మిత్ (85), ట్రావెస్ హెడ్ (51), కామెరూన్ గ్రీన్ (51) పరుగులతో రాణించాడు. దీంతో ఆసీస్ 8 వికెట్లకు 575 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.


ఘోర పరాభవం


386 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 204 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. తెంబా బవుమా 65 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వెయిర్నే33 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలమవటంతో సౌతాఫ్రికాకు ఘోర పరాభవం తప్పలేదు. ద్విశతకం చేసిన డేవిడ్ వార్నర్  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 


దక్షిణాఫ్రికా ఓటమి- భారత్ కు లాభం


ఆస్ట్రేలియాతో చేతిలో దక్షిణాఫ్రికా ఘోర ఓటమి భారత్ కలిసొచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేసులో సౌతాఫ్రికా వెనుకబడింది. ఈ భారీ విజయంతో ఆసీస్ దాదాపు ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్నట్లే. ఇక ఈ ఓటమితో సౌతాఫ్రికా పాయింట్ల పట్టికలో 72 పాయిట్లంతో 54.55 శాతం నుంచి 50 శాతానికి పడిపోయింది. బంగ్లాదేశ్ పై విజయంతో టీమిండియా 99 పాయింట్లు సాధించింది. 58.93 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది.