India vs Bangladesh , T20 World Cup Super Eight:  సూపర్‌ ఎయిట్‌(Super 8) లో బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు జూలు విదిల్చారు. సూర్యకుమార్‌ యాదవ్(Surya Kumar yadav) మినహా మిగిలిన బ్యాటర్లందరూ ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో టీమిండియా(India) భారీ స్కోరు చేసింది. విరాట్‌ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే, హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా  నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి  196 పరుగులు చేసింది.   ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత బ్యాటర్లు నెమ్మదైన పిచ్‌పై భారీ స్కోరు సాధించారు. బుమ్రా నేతృత్వంలోని భారత బౌలింగ్‌ దాడిని ఎదుర్కొంటూ ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం అంత తేలికేం కాదు. పిచ్‌ నెమ్మదిగా ఉండడంతో పరుగులు రావడం కష్టంగా మారనుంది. ఇలాంటి పిచ్‌పై భారత బౌలర్లను ఎదుర్కొంటూ బంగ్లా ఎంత వరకూ పోరాడగలదో చూడాలి.

 

చెలరేగిన బ్యాటర్లు

అంటిగ్వాలోని సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో జరిగిన  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ- విరాట్‌ కోహ్లీ మంచి ఆరంభాన్ని అందించారు. ఈ మెగా టోర్నీలో తొలిసారి విరాట్‌ కోహ్లీ పూర్తి ఆత్మ విశ్వాసంతో కనపడ్డాడు. ఆరంభంలో రోహిత్‌ కంటే ధాటిగా బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ... బంగ్లా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. రోహిత్-కోహ్లీ జోడీ 304 ఓవర్లలోనే 39 పరుగులు జోడించారు. కోహ్లీ రెండు కళ్లు చెదిరే సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ కేవలం 11 బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్‌తో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. షకీబుల్‌ హసన్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌, ఫోర్‌ కొట్టిన రోహిత్‌... మరో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

రోహిత్‌ అవుటైనా కోహ్లీ జోరు మాత్రం తగ్గలేదు. ముజీబుర్‌ రెహ్మన్‌ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన సిక్స్‌... 98 మీటర్ల దూరంలో పడింది. ఇక  కోహ్లీ భారీ స్కోరు ఖాయం అనుకుంటున్న వేళ తంజీమ్ హసన్‌ షకీబ్‌ టీమిండియాను దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాడు. 28 బంతుల్లో ఒక  ఫోర్‌, మూడు సిక్సులతో 37 పరుగులు చేసి క్రీజులో నిలదొక్కుకున్న కోహ్లీని హసీన్‌ షకీబ్‌ అవుట్‌ చేశాడు. కోహ్లీ అవుటైన తర్వాత ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్‌ కొట్టిన సూర్య ఆ తర్వాతి బంతికే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో 77 పరుగులకు టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

 

అయినా తగ్గలేదు

77 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయినా టీమిండియా దూకుడు మంత్రాన్ని కొనసాగించింది. రిషభ్ పంత్ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. క్రీజులో ఉన్నంత సేపు భారీ షాట్లు ఆడాడు. 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులతో పంత్‌ 36 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం దూబేతో జతకలిసిన హార్దిక్‌ పాండ్యా  మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న దూబే ఆ తర్వాత ధాటిగా ఆడాడు. 24 బంతుల్లో మూడు సిక్సర్లతో 34 పరుగులు చేసి దూబే అవుటయ్యాడు. దూబే అవుటైనా చివరి వరకూ క్రీజులో నిలిచిన పాండ్యా టీమిండియాకు భారీ స్కోరు అందించాడు. 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో హార్దిక్‌ పాండ్యా  అర్ధ శతకం చేశాడు. చివరి ఓవర్‌ చివరి బంతికి ఫోర్‌ కొట్టి పాండ్యా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత టపార్డర్‌ మెరుపు బ్యాటింగ్‌తో టీమిండియా  నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి  196 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో హొసైన్‌, షకీబ్‌ చెరో రెండు వికెట్లు తీశారు.