T20 World Cup 2024 semi final qualification scenarios: టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్ బెర్తు కోసం ఎనిమిది జట్లు పోరాడుతున్నాయి. అగ్ర జట్లు బెర్తులను దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. టీ 20 ప్రపంచకప్ సూపర్ ఎయిట్(Super -8) మ్యాచ్‌లు ఉత్కంఠ రేపుతున్నాయి. అగ్ర జట్లు సాధికార విజయాలు సాధస్తుండడంతో సెమీస్‌కు చేరే జట్లపై ఆసక్తి పెరుగుతోంది.
గ్రూప్ 2లో సెమీస్ బెర్తు కోసం మూడు అగ్ర జట్లు పోరాడుతున్నాయి. ఇప్పటికే సౌతాఫ్రికా(South Africa) సెమీస్ బెర్తును దాదాపు ఖాయం చేసుకోగా... ఇప్పుడు ఇంగ్లాండ్(England)-ఆతిథ్య విండీస్(West Indies) మధ్య నాకౌట్ బెర్తు కోసం పోరు నెలకొంది. సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో భాగంగా అమెరికాను చిత్తు చేసిన విండీస్... సెమీస్ బెర్తు రేసులోకి దూసుకొచ్చింది. ఇప్పుడు ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌లు ఆడి ఒక విజయం సాధించగా... కరేబియన్లు కూడా ఇదే స్థితిలో ఉన్నారు.
ఇంగ్లాండ్‌కు కష్టమేనా..?
టీ 20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. ఢిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఇప్పుడు ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. సూపర్-8 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను దక్షిణాఫ్రికా ఓడించింది. ఈ ఓటమితో బ్రిటీష్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకోవడం కష్టంగా మారింది. సూపర్-8లోని మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఈ రెండు గ్రూపులలోనూ మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. గ్రూప్ 1 గురించి చెప్పాలంటే, సెమీ-ఫైనల్ చేరేందుకు భారత్, ఆస్ట్రేలియా దాదాపుగా సిద్ధంగా ఉన్నాయి.
గ్రూప్ వన్లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లకు సెమీస్ చేరే అవకాశాలు చాలా తక్కువ. ఇక రెండో గ్రూప్ లో మాత్రం పోరు ఆసక్తికరంగా మారింది. గ్రూప్-2లో ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించి దక్షిణాఫ్రికా దాదాపు సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇక మిగిలిన ఒక బెర్తు కోసం రెండో స్థానంలో ఉన్న వెస్టిండీస్, మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ పోరాడుతున్నాయి. అమెరికా నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ సెమీస్ చేరే మార్గం మాత్రం క్లిష్టంగా ఉంది.
సౌతాఫ్రికా ఖాయం
గ్రూప్ 2లో దక్షిణాఫ్రికా సెమీస్ చేరడం దాదాపు ఖాయం. అయితే అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ తేడాతో గెలవడంతో ఇప్పుడు గ్రూప్ 2లో పోరు ఆసక్తికరంగా మారింది. ఈ గ్రూప్‌లో వెస్టిండీస్-ఇంగ్లాండ్ రెండేసి పాయింట్లతోనే ఉన్నా నెట్ రన్‌రేట్ పరంగా విండీస్ రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు వెస్టిండీస్ తమ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలిస్తే సెమీస్ చేరుతుంది. ఇంగ్లాండ్ చివరి మ్యాచ్‌లో అమెరికాపై భారీ తేడాతో గెలిస్తే మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు సెమీస్ చేరుతుంది. వెస్టిండీస్‌ను దక్షిణాఫ్రికా ఓడిస్తే ఇంగ్లండ్‌కు సెమీస్ మార్గం సులభమవుతుంది. ప్రొటీస్‌తో జరిగే మ్యాచ్‌లో విండీస్ గెలిస్తే అమెరికాను ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది. దక్షిణాఫ్రికాపై కూడా విండీస్ భారీ తేడాతో గెలిస్తే ఇంగ్లాండ్ అవకాశాలు సన్నగిల్లి మెగా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంటుంది.