India vs Bangladesh preview and prediction : టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా(India)సెమీస్‌ బెర్తుపై కన్నేసింది. సూపర్‌ ఎయిట్‌(Super 8) లో అఫ్గాన్‌పై ఘన విజయం సాధించిన రోహిత్‌ సేన.. నేడు బంగ్లాదే(BAN)తో తలపడనుంది. ఈ ప్రపంచకప్‌లో మనుగడ కోసం పోరాడుతున్న బంగ్లాపై... టీమిండియా  విజయం సునాయసమే అయినా... తక్కువ అంచనా వేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పుదు. విండీస్‌ పిచ్‌లు నెమ్మదిగా ఉంటున్న వేళ ఇవాళ మ్యాచ్‌ కూడా బ్యాటర్లకు సవాల్‌ విసరనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకోవాలని టీమిండియా చూస్తుండగా... భారత జట్టుకు షాక్ ఇచ్చి సెమీస్‌ అవకాశాలను నిలుపుకోవాలని బంగ్లా పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే బంగ్లా సెమీస్‌ దారులు పూర్తిగా మూసుకుపోతాయి. అయితే అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్‌ను బంగ్లాదేశ్‌ అడ్డుకోగలదా అన్నది ఆసక్తికరంగా మారింది.


 

బ్యాటర్లు ఏం చేస్తారో

సూపర్‌ ఎయిట్‌లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. ఆంటిగ్వా(Antigua )లో బంగ్లాతో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాలో చేతిలో ఓడిన బంగ్లాదేశ్‌తో రోహిత్ సేన తలపడనుంది. అయితే ఇప్పటివరకూ భారత టాపార్డర్‌ జూలు విదల్చక పోవడం రోహిత్ సేనను కలవరపరుస్తోంది. సూర్యకుమార్‌ యాదవ్(Surya Kumar Yadav) మినహా మిగిలిన బ్యాటర్లు అందరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. విరాట్ కోహ్లీ(Virat), రోహిత్‌(Rohit) వరుసగా విఫలమవుతున్నారు. రిషభ్‌ పంత్ రాణిస్తున్నా అతని నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. శివమ్‌ దూబే పరిస్థితి కూడా అలాగే ఉంది. బ్యాటర్లు విఫలమవుతుండడంతో టీమిండియాపై ఒత్తిడి పెరుగుతోంది. బంగ్లాకు నాణ్యమైన స్పిన్నర్లు ఉండడంతో ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. బంగ్లాదేశ్ లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముస్తాఫిజుర్ రెహ్మాన్, రిషాద్ హొస్సేన్‌ రాణిస్తుండడంతో వీరు భారత బ్యాటర్లను ఏ మేరకు ఇబ్బంది పెట్టగలరో చూడాలి. రోహిత్‌, కోహ్లీ మరోసారి మ్యాచ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ కోహ్లీని వన్‌డౌన్‌కు తీసుకురావాలని భావిస్తే మాత్రం యశస్వీ జైస్వాల్‌కు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. టీమిండియా మరోసారి అఫ్గాన్‌పై ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

బలంగా బౌలింగ్‌

బుమ్రా నేతృత్వంలోని భారత బౌలింగ్‌ చాలా బలంగా కనిపిస్తోంది. బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా పేస్‌ భారాన్ని మరోసారి మోయనున్నారు. అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌లో కూడిన స్పిన్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బుమ్రాను ఎదుర్కోవడం బంగ్లా బ్యాటర్లకు అంత తేలికైనా విషయం కాదు. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్లు వేసి కేవలం ఏడు పరుగులే ఇచ్చి 3 వికెట్లు నేలకూల్చాడు. విభిన్న బంతులతో బెంబేలెత్తిస్తున్న బుమ్రా మరోసారి భారత్‌కు ప్రధాన అస్త్రంగా మారనున్నాడు. 

 

భారత్ జట్టు( అంచనా):  రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్,  కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా 

 

బంగ్లాదేశ్‌(అంచనా): తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్.