West indies vs usa highlights : టీ 20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024)సూపర్‌ ఎయిట్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌(WI) ఘన విజయం సాధించి సెమీస్‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. మరో ఆతిథ్య దేశం అమెరికా(USA)తో జరిగిన మ్యాచ్‌లో కరేబియన్లు చెలరేగిపోయారు. అసలు అవకాశమే ఇవ్వకుండా అమెరికాపై ఘన విజయం సాధించి రన్‌రేట్‌ను భారీగా పెంచుకున్నారు. విండీస్‌ ధాటికి అమెరికా తట్టుకోలేకపోయింది. ఏ దశలోనూ విండీస్‌కు.. అమెరికా పోటీ ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన 128 పరుగులు చేయగా... 129 పరుగుల లక్ష్యాన్ని కరేబియన్లు పది ఓవర్లలోనే ఛేదించేశారు. ఈ విజయం గ్రూప్‌ 2లో విండీస్‌ రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఇంగ్లాండ్‌, విండీస్‌ రెండు మ్యాచులు ఆడి ఒక విజయంతోనే ఉన్నా... బ్రిటీష్‌ జట్టు కంటే కరేబియన్ల రన్‌రేట్‌ మెరుగ్గా ఉంది.

 

సమష్టిగా రాణించిన బౌలర్లు

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్ తీసుకుంది. ఆరంభం నుంచే అసలు పరుగులే ఇవ్వకుండా విండీస్‌ బౌలర్లు... అమెరికా బ్యాటర్లను కట్టడి చేశారు. రెండో ఓవర్‌లోనే స్టీవెన్‌ టేలర్‌ను ఆండ్రూ రసెల్‌ అవుట్‌ చేసి వెస్టిండీస్‌కు తొలి వికెట్‌ అందించాడు. కేవలం మూడు పరుగుల వద్దే అమెరికా తొలి వికెట్‌ కోల్పోయింది.  ఆ తర్వాత ఆండ్రీస్‌ గౌస్‌-నితీశ్‌కుమార్‌ అమెరికాను కాసేపు ఆదుకున్నారు. విండీస్‌ బౌలర్లను ఆచితూచి ఎదుర్కొన్న ఈ ఇద్దరు స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. 





 

నితీశ్‌కుమార్‌ అవుట్‌తో విండీస్‌ వికెట్ల పతనం మళ్లీ ఆరంభమైంది. 19 బంతుల్లో 20 పరుగులు చేసిన నితీశ్‌ను మోటీస్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.  దీంతో 51 పరుగుల వద్ద విండీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. గౌస్‌ మాత్రం కాస్త ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 29 పరుగులు చేసి గౌస్‌ అవుటయ్యాడు. నితీశ్‌ అవుటైనా కాసేపటికే గౌస్‌ కూడా అవుట్‌ కావడంతో అమెరికాపై ఒత్తిడి పెరిగింది. అమెరికా బ్యాటింగ్‌ లైనప్‌లో గౌస్‌ చేసిన ఈ 29 పరుగులే అత్యధికం. గౌస్‌ను అల్జారీ జోసెఫ్‌ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత ఈ టీ 20 ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ఆరోన్‌ జోన్స్‌ భారీ అంచనాలతో బరిలోకి దిగాడు. కానీ 11 బంతుల్లో 11 పరుగులు చేసిన జోన్స్‌ను చేజ్‌ అవుట్ చేయడంతో అమెరికా వికెట్ల పతనం వేగంగా సాగింది. 51 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన అమెరికా.... 85  పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మిలింద్‌ కుమార్‌ 19, షాడ్లీ 18, అలీ ఖాన్‌ 14 పరుగులు చేయడంతో అమెరికా19.5 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ బౌలర్లలో రస్సెల్‌ 3, చేజ్‌ మూడు వికెట్లు తీశారు.

 

దంచేశారు

129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభం నుంచే బాదుడు మొదలుపెట్టిన కరేబియన్లు... అమెరికా బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్‌ షై హోప్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతులు ఎదుర్కొన్న హోప్‌... 4 ఫోర్లు, 8 సిక్సులతో 82 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. చార్లెస్‌ 15 పరుగులు చేసి అవుటయ్యాడు. నికోలస్‌ పూరన్‌ 12 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సులతో 27 పరుగులు చేసి బ్యాట్ ఝుళిపించాడు. దీంతో కేవలం 10.5 ఓవర్లలో కేవలం ఒకే వికెట్‌ కోల్పోయి విండీస్‌ విజయం సాధించింది. సూపర్‌ ఎయిట్‌లో 55 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించిన కరేబియన్లు సెమీస్‌ దిశగా అడుగు ముందుకేశారు.